నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ
సారథి, హైదరాబాద్: కరోనా పరిస్ధితుల కారణంగా కష్టాల పాలైన కళాకారుల కుటుంబాలను ఆదుకునే దిశగా ‘రైస్ బకెట్ చాలెంజ్’, ‘ఫీడ్ ది నీడీ’ స్వచ్ఛంద సేవాసంస్థలు ముందుకొచ్చి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాయి. కర్మన్ ఘాట్ శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి అందజేశారు. గతేడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఉత్సవాలు, శుభకార్యాలు, సభలు, సమావేశాలు సజావుగా జరుపుకోలేని కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో అనేకమంది కళాకారులు చేతినిండా పనిలేక రోడ్డునపడ్డారు. కళాకారుల దీనస్థితిని యువ గాయకుడు, సమన్వయకర్త ఎస్.గోవింద్ రైస్ బకెట్ చాలెంజ్ సంస్థ వ్యవస్థాపకురాలు మంజులత, ఫీడ్ ది నీడీ సంస్థ బృందం దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని గమనించిన సేవా సంస్థలు వివిధ విభాగాలకు చెందిన 100 మంది కళాకారుల కుటుంబాలకు మూడు వారాలకు సరిపడా బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశాయి. గతంలో కూడా కళాకారులను ఆదుకున్నట్లు సమన్వయకర్త గోవింద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ కడుపులు నింపడం అదృష్టంగా భావిస్తున్నామని కళాకారులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సాంస్కృతిక రంగ ప్రముఖులు సింగర్ గోవింద్, సత్యభరణి, మిమిక్రీ భవిరి శివ, ఆల్ రౌండర్ రవి, శ్రీనాథ్ రెడ్డి, ఫీడ్ ది నీడీ సంస్థ ప్రశాంత్ పాల్గొన్నారు.