సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గురువారం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 200 మంది విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ప్రభుత్వం విస్మరించిందని, పాఠశాలలు తెరుచుకోకపోవడంతో 14 నెలలుగా జీతాలు లేక వారి కుటుంబాలు తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా బాధ్యతలు తీసుకుని విధులు నిర్వహిస్తున్న విద్యావలంటీర్లకు అండగా ఉంటామన్నారు.
విద్యావలంటీర్ల సమస్యలపై బీజేపీ తరఫున కార్యాచరణ చేపట్టి వారి డిమాండ్ల పరిష్కారం కోసం పెద్దఎత్తున పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎల్లేని దాతృత్వానికి విద్యావలంటీర్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు పదిర భీమేష్, జిల్లా మహిళామోర్చా ప్రధాన కార్యదర్శి బద్దుల శశిరేఖ ప్రవీణ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల్ యాదవ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజుయాదవ్, బీజేపీ జిల్లా నాయకులు, మండల ఉపాధ్యక్షుడు, నాయకులు కార్యకర్తలు, విద్యావలంటీర్ల జిల్లా నాయకులు, కొల్లాపూర్ తాలూకా నాయకులు పాల్గొన్నారు