Breaking News

కన్నెర్రజేసిన రైతన్నలు

ధాన్యం తరలించడంలో జాప్యం
  • ఒక్కోబస్తాకు 3 కిలోల తరుగు
  • రాస్తారోకో చేపట్టి చల్మేడ గ్రామరైతులు

సారథి, రామాయంపేట: సుమారు 30 లారీల వరిధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ఉన్నాయని, ఎండకు ఎండుతూ.. వానకు నానుతున్న వడ్లను కాంటాలు చేయడం లేదని, రైస్ మిల్లుకు తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ రైతులు మెదక్- సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రామయంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొన్నిరోజుల క్రితం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చేతులమీద కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారని, కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఉపసర్పంచ్ రమేష్ ఆరోపించారు. కొనుగోలు సెంటర్ కు లారీలు సరిగ్గా రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సొంత ట్రాక్టర్లు ఉన్న రైతులు ధాన్యాన్ని రైస్ మిల్లుకు తీసుకుని వెళ్తే తేమ, తాలు పేరుతో బస్తాకు మూడుకిలోల తరుగు తీస్తున్నారని వాపోయారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న నిజంపేట తహసీల్దార్ జయరాం, స్థానిక ఎస్సై ప్రకాష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని లారీలు వచ్చేలా చూస్తామని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.