Breaking News

మార్కు తగ్గిందో.. ర్యాంకు గోవిందా!

మార్కు తగ్గిందో.. ర్యాంకు గోవిందా!

  • జేఈఈ మెయిన్​, అడ్వాన్స్, నీట్​ అభ్యర్థులకు నిపుణుల సూచనలు
  • పరీక్షల్లో సమయ సద్వినియోగమే కీలకం
  • ప్రణాళికతో కూడిన సంసిద్ధత అవసరం
  • చిన్నజాగ్రత్తలతో ఒత్తిడిని జయించండి
  • పాజిటివ్​ఆలోచనలతో సత్ఫలితాలు

:: కె.నరహరిగౌడ్, సామాజిక సారథి, ప్రత్యేక ప్రతినిధి

ఇంటర్మీడియట్​.. ​విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడే తమ బిడ్డ జాగ్రత్తగా అడుగు వేయాలనీ, సురక్షితంగా ఒడ్డుకు చేరాలని ఏ తల్లితండ్రులైనా కోరుకుంటారు. డాక్టర్, ఇంజనీర్​కావాలనుకునే వారి కలలు సాకారం చేరుకోవాలన్నా ఈ చౌరస్తా దాటాల్సిందే. ఐఐటీ, ఎన్ఐటీ, తదితర ఇంజనీరింగ్​కళాశాలలతో పాటు ఎయిమ్స్​తదితర మెడికల్​ కళాశాలల్లో సీటు సంపాయించుకోవడానికి అభ్యర్థుల మధ్య పోటీ బాగానే ఉంటుంది. జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్​, జేఈఈ అడ్వాన్స్, నీట్​తో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్​తదితర పరీక్షలొస్తున్నాయి. ఈ పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకూ పరీక్షలంటే ఎంతో కొంత ఆందోళన సహజం. రెండేళ్లపాటు నేర్చుకున్న పాఠాలను, వాటి ద్వారా పొందిన పరిజ్క్షానాన్ని ప్రదర్శించి, మంచి మార్కులు సాధించడానికి ఈ పరీక్షలు ఒక అవకాశం. కొందరు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం సిలబస్​పూర్తి చేసి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధపడితే, చాలామంది విద్యార్థులు పాఠాలు చదువుకున్నా పరీక్షల్లో సరిగా రాయగలమో లేదోననే ఆందోళనతో సతమతమవుతుంటారు. తరగతి గదుల్లో బాగా రాణించే విద్యార్థులు సైతం ఆందోళన కాలంగా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోతుంటారు. పరీక్షల గురించి ఆందోళన చెందకుండా కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి నుంచి బయటపడి పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు.

పకడ్బందీగా.. ప్రణాళికాబద్ధంగా!
జేఈఈ మెయిన్​, అడ్వాన్స్​, నీట్​దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నాయి. దాదాపు ఈ పరీక్షలకు ఇంజనీరింగ్ కు 10 లక్షలు, మెడిసిన్​ అభ్యర్థులు 18 లక్షలకు పైగానే పోటీ పడతారని అంచనా. దీనిని బట్టి పోటీ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉన్న సమయం చాలా తక్కువ. అందుకే ప్రిపరేషన్​పకడ్బందీగా, ప్రణాలికబద్ధంగా జరగాలి. పరీక్షల్లో ఒక్క మార్కు కోల్పోయినా ర్యాంకు వందల స్థానాల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే అభ్యర్థులు ఆయా కళాశాలలు ఇచ్చిన స్టడీ మెటీరియల్​ సిద్దం చేసుకుని ఒక దశ తిరగేసి ఉంటారు. ఇప్పటికే పరీక్ష తేదీ ఉన్న సమయం తక్కువ కాబట్టి పరీక్షార్థుల టైంటేబుల్​ వ్యవస్థీకృతంగా ఉండాలి. కాసింత కూడా సమయం వృథా కాకూడదు.

స్టడీ షెడ్యూల్​ ఇలా ఉండాలి..
పరీక్ష తేదీ దగ్గర పడింది. కాబట్టి ప్రిపరేషన్​ కు ఎక్కువ సమయం కేటాయించండి. మొత్తం పాఠ్యాంశాలను ఏ ఒక్కటీ వదలకుండా కవర్​ చేయండి. టెస్టు పేపర్లను ఎక్కువ ప్రాక్టీసు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒక్కో ప్రశ్నాపత్రాన్ని ఎంత సమయంలో చేస్తున్నామో గమనించాలి. వీలయినంత నిర్ణీత సమయంలోగా చేసేలా చూసుకోవాలి. పరీక్షకు కొద్ది రోజుల ముందు రివిజన్​ ప్లాన్​ చేసుకోండి. రివిజన్​విశ్లేషణాత్మకంగా ఉండాలి. మీరు ఎక్కడ వీక్​గా ఉన్నారో గుర్తించి పట్టు సాధించాలి. చాలా మంది అభ్యర్థులు ఎంట్రెన్స్​ఆబ్జెక్టివ్​తరహాలో ఉంటుందని జవాబు ఏదోలా గుర్తించవచ్చనే ఆలోచనలో ఉంటారు. ఇది ర్యాంకు సాధనకు తోడ్పడదు. పాఠ్యాంశాలను స్థూలంగా చదివితే ప్రశ్న ఏ రూపంలో వచ్చినా జవాబు గుర్తించడానికి వీలుంటుంది. అన్ని టాపిక్స్​పై పట్టు సాధించాలి.

జేఈఈ మెయిన్ ​పరీక్ష నమూనా
జేఈఈ మెయిన్​ పరీక్ష ఆబ్జెక్టివ్​, నుమెరికల్​తరహాలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు ఛాయిస్​లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నిజానికి ప్రశ్నాపత్రంలో మనకు కరెక్టు అనిపించే సమాధానంపై కూడా సంశయం కలిగించే రీతిలో సమాధానాలు ఉంటాయి. మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 75 ప్రశ్నలకు 180 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. జవాబును గుర్తించడంలో ఏమాత్రం తడబడినా ఆ ప్రశ్నకు కరెక్టు సమాధానం గుర్తించకపోతే ఆ ప్రశ్నకు రావాల్సిన మార్కులు రాకపోవడంతో పాటు మైనస్​ మార్కు వస్తుంది. దీంతో మనకు రావాల్సిన ర్యాంకు వందల స్థానాల్లోకి నెట్టి వేస్తుంది. ఈ పరీక్షల్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది.

నీట్ పరీక్ష కోసం..
జాతీయస్థాయ మెడికల్​ ప్రవేశ పరీక్ష నేషనల్​ఎలిజిబిలిటీ కమ్​ఎంట్రన్స్​టెస్ట్(నీట్) రాసే అభ్యర్థులు కూడా ఎంతో జాగ్రత్తగా ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. నీట్​ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 180 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. సమాధానం సరిగా గుర్తించకపోతే ఒక మార్కు తీసివేయనున్నారు.

పరీక్షల షెడ్యూల్​
జేఈఈ మెయిన్​ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్​ఈనెల 20 నుంచి 29వరకు, రెండో సెషన్​జూలై 21 నుంచి 30 వరకు నిర్వహిస్తారు. అలాగే జేఈఈ అడ్వాన్స్​ఆగస్టు 28న నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష జూలై 17న నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్ష వాయిదా పడొచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై నేషనల్​టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎలాంటి ప్రకటన చేయలేదు.