Breaking News

గురుకులంలో కీచకపర్వంపై కలెక్టర్​ సీరియస్​

గురుకులంలో కీచకపర్వంపై కలెక్టర్​సీరియస్​

  • ప్రిన్సిపల్ ​డి.శ్రీనివాస్ ​వ్యవహారంపై విచారణ
  • కేసు దర్యాప్తు చేస్తున్న కొత్తకోట పోలీసులు

సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రస్తుతం కొనసాగుతున్న వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయినిపై ప్రిన్సిపల్ కీచరపర్వం ఆలస్యంగా వెలుగు చూడటంతో జిల్లా కలెక్టర్ యాస్మిన్​భాషా స్పందించారు. వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్​ను పిలిచి ఛీవాట్లు పెట్టారు. ఆయన ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాథ్స్ టీచర్ ​టి.మాధవిని ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభను గుండెల్లో దాచుకొని నేరుగా గురుకులాల రీజినల్ ​కోఆర్డినేటర్​కు తన గాథను మూడు పేజీల్లో గాథను రాసింది. ‘‘నేను ఈ స్కూలులో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సార్.. క్లర్క్ తో కలిసి నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. ప్రిన్సిపల్ సార్ ​ఒకరోజు నమ్ము రూమ్​కు రమ్మని పిలిచాడు. నీవు అందంగా ఉన్నావని అంటున్నాడు. ఎదురుచెప్పితే నన్ను అసభ్యకరమైన మాటలతో మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నాడు. నేను ఒకసారి ఆఫీసులో సంతకం చేస్తుండగా, వెనుక నుంచి వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. ఆయనకు ఉన్న అధికారాలను వినియోగించుకొని నన్ను లొంగదీసుకోవాలని చూస్తున్నాడు. నాకు ఏం జరిగినా ప్రిన్సిపల్​డి.శ్రీనివాసులు మాత్రమే కారణం” అంటూ తన బాధను వ్యక్తం చేసింది.

‘సామాజిక సారథి’లో ‘నన్ను రూముకు రమ్మన్నాడు!’ శీర్షికన ఈనెల 28న న్యూస్​రావడంతో కొత్తకోట పోలీసులు సైతం స్పందించారు. బాధితురాలైన మ్యాథ్స్​టీచర్​మాధవి నుంచి వివరాలు సేకరించారు. ఏం జరిగిందో స్కూలుకు వెళ్లి అసలు విషయం ఆరాతీశారు. టీచర్​మాధవిపై సోషల్​మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేసిన క్లర్క్ నర్సింహ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట సీఐ శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.