- నిన్న ఒకరు.. తాజాగా ఇద్దరు మృతి
- మరికొంత మందికి పాజిటివ్ గా నిర్ధారణ
సారథి, పెద్దశంకరంపేట:
కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. కేసులు పెరుగుతుండడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన ఓ వ్యక్తి(48) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈనెల21న పెద్దశంకరంపేట లోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోగా, అతనికి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అలాగే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం 69 మందికి కరోనా పరీక్షలు చేయగా, 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. మరో 49మందికి నెగిటివ్ గా వచ్చింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, బౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
మరో ఇద్దరు వృద్ధులు మృతి
పెద్దశంకరంపేట మండల పరిధిలో కరోనాతో ఇద్దరు మృతిచెందినట్లు వైద్యాధికారి డాక్టర్ పుష్పలత సోమవారం తెలిపారు. కట్టెల వెంకటాపూర్, బూరుగుపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వృద్ధులు మృతి చెందారని వెల్లడించారు. ఈనెల 22న కట్టెల వెంకటాపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు(68) కరోనా చికిత్స చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. ఈనెల 24న బూరుగుపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు(75) పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. ఇద్దరు కూడా చికిత్స పొందుతూ చనిపోయారని డాక్టర్ పుష్పలత తెలిపారు.