Breaking News

పార్ట్ టైమ్ ​టీచర్లు, లెక్చరర్లకు న్యాయం చేయాలే

గురుకులాల పార్ట్​టీచర్లు, లెక్చరర్లకు న్యాయం చేయాలే

  • గురుకులాల్లో పనిచేస్తున్న అందరికీ సమాన వేతనాలు
  • ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరి డిమాండ్​

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ​పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి పోటీచేస్తున్న ఇండిపెండెంట్ ​ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరి ఆదివారం రంగారెడ్డి, నాగర్​కర్నూల్​జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలువురు గ్రాడ్యుయేట్లు, పార్టీ టైమ్​ లెక్చరర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అడ్వకేట్లను కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా తెల్కపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలికల స్కూలు, కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగులు, లెక్చరర్లను కలిశారు. సోషల్ ​వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ​రెసిడెన్షియల్ ​స్కూళ్లలో పనిచేస్తున్న పార్ట్​ టీచర్లు, లెక్చరర్లకు అతితక్కువ వేతనాలు ఉన్నాయని అన్నారు. పీజీటీ, టీజీటీలకు రూ.14వేలు, జూనియర్​ లెక్చరర్లకు రూ.18వేల జీతం మాత్రమే ఇస్తున్నారని వివరించారు. కానీ మైనార్టీ వెల్ఫేర్ ​గురుకులాల్లో పనిచేస్తున్న పీజీటీ, టీజీటీలకు రూ.24వేలు, జూనియర్​ లెక్చరర్లకు రూ.28వేలు ఇస్తున్నారని అన్నారు.

అలాగే ప్రభుత్వ జూనియర్ ​కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ​లెక్చరర్లకు రూ.21,600 ఇస్తున్నారని చెప్పారు. విద్యావ్యవస్థ, ప్రభుత్వం ఒక్కటే అయినప్పుడు జీతంలో వ్యత్యాసం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న వారిపై వివక్ష తగదని హెచ్చరించారు. గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్​టైమ్ ​లెక్చరర్లు, ఇతర టీచర్లకు స్థాయిని బట్టి సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. అంతకుముందు ఆయన రంగారెడ్డి జిల్లా మైసిగండిలో అడ్వకేట్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ, గురుకులాల పరిరక్షణకు కృషిచేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పదవుల కోసం ప్రజాసమస్యలపై పోరాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం రఘుపతిపేట సమీపంలోని రామగిరి క్షేత్రంలో పలువురు గ్రాడ్యుయేట్లు ఏర్పాటుచేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముకురాల శ్రీహరి పాల్గొన్నారు.

మైసిగండి: ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతు తెలుపుతున్న పట్టభద్రులు
రామగిరి క్షేత్రంలో ముకురాల శ్రీహరిని సన్మానిస్తున్న గ్రాడ్యుయేట్స్​