Breaking News

పాలెంలో బోగస్​ ఓట్లు!

పాలెంలో బోగస్​ ఓట్లు!
  • గ్రామంలో 12 వార్డులు
  • ప్రతి వార్డులో 20 ఓట్ల చొప్పున నమోదు
  • నేతల వ్యూహమా?, అధికారుల తప్పిదమా?
  • అధికారులకు స్థానికుల ఫిర్యాదు

సామాజికసారథి, బిజినేపల్లి: స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు కూడా ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. వార్డుల విభజన, కొత్త ఓటర్ల చేర్పులు, మార్పులు వంటి ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. దసరా తర్వాత గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం కూడా ఊపందుకుంది. అధికారులు అంతా రెడీ చేసి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు బాగానే బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామంలో బోగస్​ ఓట్లు నమోదుచేశారని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మేజర్​ పంచాయతీ అయిన పాలెంలో 5వేలకు పైగా జనాభా ఉంటుంది. 12 వార్డులు ఉండగా, 3వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో ప్రతి వార్డులో 20కి పైగా బోగస్​ ఓట్లను నమోదుచేసినట్లు ఇటీవల వెలుగుచూసింది. ఇలా మొత్తంగా 200 ఓట్ల వరకు నమోదైనట్లు ఓ అంచనా. వాటిపై విచారణ జరిపి తొలగించాలని గ్రామానికి చెందిన మల్లేష్​ అనే యువకుడు రెవెన్యూ అధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

బోగస్​ వెనక నేతల హస్తం..?
స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మేజర్​ పంచాయతీ అయిన పాలెంపై పలువురు అధికార, విపక్ష నేతలు కన్నేశారు. ఎలాగైనా గెలిచి తీరాలని పలువురు నాయకులు ఎప్పటినుంచో పావులు కదుపుతున్నారు. అయితే ఎలాగైనా గెలవాలని భావిస్తున్న నాయకులు కొందరు బోగస్​ ఓట్లను నమోదు చేయించారన్న ప్రచారమూ జరుగుతోంది. ఒకరికి ఒక్కో వార్డులో ఒకటి రెండు ఓట్లు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏదైనా బోగస్​ ఓట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాజకీయ నాయకుల వ్యూహమా? లేక స్థానిక అధికారుల తప్పిదమా? తేలాల్సి ఉంది. బోగస్​ ఓటర్లపై వస్తున్న ఫిర్యాదులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *