- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై అనుచిత పోస్టర్
- బీజేపీ నాయకులపై పోలీసులకు టీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిపై బీజేపీ నాయకులు రూపొందించిన ఓ పోస్టర్చిచ్చురేపింది. ‘ఎమ్మెల్యేను ప్రజాహంతకుడు నల్లమట్టి దొంగ’గా సంబోధిస్తూ వేసిన పోస్టర్ రాజకీయంగా వివాదానికి దారితీసింది. ఇదిలాఉండగా, తమ పొలాలు నీటి ముంపునకు గురవుతున్నాయని, పంటలు పండించుకోలేకపోతున్నామని.. ఉయ్యలవాడకు చెందిన దళితరైతు కాశన్న ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని నల్లమట్టి దొంగగా అభివర్ణిస్తూ.. రైతు చావుకు కారణమయ్యాడని పోస్టర్ ను రూపొందించారు. దీనిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ దిలీపాచారి రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను విడిచిపెట్టేది లేదని ప్రకటించారు.
ఖండించిన టీఆర్ఎస్ నాయకులు
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని ప్రజాహంతుడిగా, నల్లమట్టి దొంగ అని, ఉయ్యాలవాడ కాశన్నది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనన చిత్రీకరిస్తూ బీజేపీ నాయకులు పోస్టర్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, ఇది ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించిందని, ఈ ఆరోపణలు పూర్తి అవాస్తవని టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఈ అవాస్తవ ఆరోపణలు నియోజకవర్గంలో రెండువర్గాల మధ్య చిచ్చుపెట్టిందని, ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉన్నదని తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, అసెంబ్లీ ఇన్చార్జ్ దిలీపాచారిపై చర్యలు తీసుకోవాలని జెట్టి ధర్మరాజు పేరుతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.