Breaking News

ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారు

ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారు
  • సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు

సారథి, జగిత్యాల: రాష్ట్రంలో అదనపు కలెక్టర్లకు కియో వాహనాలు, పోలీసులకు ఇన్నోవాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ఆ రెండు కంపెనీలకు డీలర్ గా మారారని మాజీమంత్రి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫాంహౌస్ పై విచారణకు ఆదేశించాలని, నిబంధనల ప్రకారం ఉంటే దానిపై కోర్టులో స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. సోమవారం జగిత్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 2018 జూన్ నుంచి ఇవ్వాల్సి ఉండగా 2021 ఏప్రిల్ నుంచి ఇస్తాననడం, మిగతాది ఉద్యోగులు పదవి విరమణ పొందినప్పుడు చెల్లిస్తాననడం ఉద్యోగులకు నష్టం కలుగుతుందని చెప్పారు. దీనికి ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు స్వార్థంతో ఆలోచిస్తూ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం వద్ద తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 1.97లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
ఈటెల బీజేపీలో చేరి ఉండేది కాదు
మాజీమంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి ఉండేదికాదని, సీఎం కేసీఆర్ తో మాట్లాడి టీఆర్ ఎస్ లోనే ఉంటే బాగుండేదని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి హితవుపలికారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగడానికి బీజేపీ సహకరిస్తుందని చెప్పారు. స్వతంత్రంగా పోరాటం చేసి ఉంటే తెలంగాణ వాదులు ఈటెలకు అండగా ఉండేవారని పేర్కొన్నారు. ప్రగతిశీల భావాలంటే ఇవేనా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో ఉందని జీవన్ రెడ్డి అన్నారు. అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి, బండ శంకర్, గాజుల రాజేందర్, గుంటి జగదీశ్వర్, జున్ను రాజేందర్, లైశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు.