- పోలీస్ స్టేషన్‌కు చేరిన పంచాయతీ
- బిజినేపల్లి మండలం గుడ్లనర్వలో రగడ
- నాయకులు.. ఒకరిపై మరొకరు ఫిర్యాదు
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో బీసీబంధు పంచాయితీ శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్ దాకా చేరింది. అయితే అర్హులైన పేద బీసీ అభ్యర్థులను ఎంపికచేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ ఆ పార్టీ సర్పంచ్, ఉపసర్పంచ్ వారి కుమారులకు బీసీబంధులో పేర్లు తెచ్చుకోవడంతో గ్రామస్తుల ఆగ్రహం భగ్గుమన్నది. అదే గ్రామంలో రెండోవర్గంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు నేతలు నిలదీశారు. అర్హులైన పేదలకు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులైన మీరే ఇలా కుటుంబసభ్యులకు ఇచ్చుకుంటే ఎలాగని ఆ గ్రామ ఉపసర్పంచ్ భాగ్యమ్మ కుమారుడు రామకృష్ణను నిలదీశారు. దీంతో ‘మాఇష్టం వచ్చినట్లు మేం రాసుకుంటాం, మీరెవరు’ అంటూ దుర్భాషలాడుతూ ప్రశ్నించే వారిని చితకబాదినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన పేద ప్రజలకు ఇవ్వకుండా ఇలా ప్రజాప్రతినిధులే వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ పథకాలు అందజేసుకుంటే.. తమలాంటి వారి సంగతి ఏమిటని ప్రశ్నించారు. అక్కడే ఉన్న ఉపసర్పంచ్ కుమారుడు ప్రశ్నించేవారిపై పిడుగులు గుద్దులు కురిపించాడని, అడగడానికి వస్తే కొట్టడం ఏమిటి అని గ్రామస్తులు కొందరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జరిగిన సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారని తెలిసింది.