సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల వ్యవసాయాధికారి సతీష్ ఆధ్వర్యంలో క్షేత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతుక్షేత్రంలో నారుమడి దశలో పాస్పోబ్యాక్టీరియా వాడకం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా దుక్కిలో వేసే డీఏపీ, 20-20-0-13 వంటి ఎరువులు మోతాదుకు మించి వాడడం ద్వారా ఖర్చు పెరుగుతుందని, భూమి, వాతావరణ కాలుష్యం, పంటలకు జింకు లోపం ఏర్పడుతుందన్నారు. పాస్పో బ్యాక్టీరియా ద్రావణాన్ని 500 మి.లీ చిన్న గుంతలు పోసి ఆ నీటిలో వరి నారును కట్టలుగా కట్టి అరగంట సేపు నానబెడితే ఈ బ్యాక్టీరియా ద్రావణం మొక్కల వేళ్లకు అంటుకుని నాటు వేసినప్పుడు వేర్ల ద్వారా భూమిలోకి చొచ్చుకొనిపోతుందన్నారు. భూమిలో ఉన్న ఫాస్పరస్ మొక్కలకు అందుతుందన్నారు. ఈ బ్యాక్టీరియాను నేలకు అందించడం ద్వారా రైతుకు 20-25 శాతం ఎరువుల వాడకం, ఖర్చు తగ్గుతుందన్నారు. వేరువ్యవస్థ దృఢంగా పెరగడంతో పాటు పక్క వేళ్లు ఎక్కువగా వస్తాయని సూచించారు. ఆఖరి దుక్కిలో గాని లేదా నాటు వేసిన రెండు మూడు రోజుల తర్వాత పశువుల పేడ, బెల్లంతో కలిపి రెండు మూడు రోజులు మగ్గిన తర్వాత పొలంలో చల్లుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా సమర్థంగా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి గణేష్ కుమార్, దివ్యశ్రీ, రైతు రాజం పాల్గొన్నారు.
- July 14, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- NIZAMPET
- Phosphobacteria
- క్షేత్రప్రదర్శన
- పాస్పోబ్యాక్టీరియా
- వరిసాగు
- Comments Off on పాస్పోబ్యాక్టీరియాపై రైతులకు అవగాహన