Breaking News

గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

  • వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు
  • మృతులు రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ వాసులు

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న సరస్వతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు వరద నీటిలో గల్లంతయ్యారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దహేగాం మండలంలోని భీబ్రా గ్రామానికి చెందిన నేర్​పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలిస్తుండగా దహేగాం పక్క నుంచి వెళ్తున్న పెద్దవాగు ఉప్పొంగడంతో దహేగాంతో పాటు పెసరికుంట, ఐనం, ఇట్యల, రాళ్లగూడ, భీబ్రా గ్రామాలు బుధవారం వరదలో చిక్కుకున్నాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్, సింగరేణి రెస్క్యూ టీమ్ తెప్పించారు. ఈ సమయంలో సరస్వతికి పురిటి నొప్పులు రావడంతో సింగరేణి రెస్క్యూ టీమ్ కు చెందిన ఐదుగురుతో పాటు అక్కడి స్థానిక యువకుల సహాయంతో సీఐ నాగరాజు ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. రూప్ సహాయంతో దహేగాం దగ్గర ఉన్న మల్లన్నవాగు దాటారు. ఆ తర్వాత చిన్న కల్వర్టు వరద నీరు దాటుతుండగా వెనక వైపున ఉన్న సతీష్(38), రాము(32) ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన విషయాన్ని మిగతావాళ్లు గుర్తించేలోపే కనిపించకుండాపోయారు. చిన్నఐనం గ్రామానికి చేరుకున్న మిగతా సభ్యులు ఉన్నత అధికారులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు అక్కడికి మరో రెస్క్యూ టీమ్ చేరుకుని గాలింపు చేపట్టినా ఇద్దరి ఆచూకీ లభించలేదు..

గల్లంతైన మృతదేహాల లభ్యం
గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో గల్లంతైన రెస్క్యూ టీమ్ మెంబర్లు సతీష్, రాము మృతదేహాలు గురువారం తెల్లవారుజామున దహేగాం వద్ద దొరికాయి. వరద ఉధృతి తట్టుకోలేక గల్లంతయ్యారని భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దవాగులు గల్లంతైన సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ లో మృతి చెందిన ఇద్దరు కార్మికులకు పోస్టుమార్టం నిర్వహించేందుకు జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కార్మికులు ఆస్పత్రి ఎదుట రహదారిపై ఆందోళన చేపట్టారు. మృతిచెందిన వారి ఒక్కో కుటుంబానికి రెండు కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున కార్మికులు అక్కడకు చేరుకోవడం, ఆందోళన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికుల ఆందోళనకు ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతరామయ్య, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. యాజమాన్యం పరంగా రావాల్సిన నష్టపరిహారం అందేలా చూస్తామని జీఎం హామీ ఇచ్చారు.మృతి చెందిన సతీష్, రాము మృతదేహాలతో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆస్పత్రికి చేరుకుని ఇద్దరి కుటుంబసభ్యులను ఓదార్చారు.
కాగా, మృతులు శ్రీరాంపూర్​కు చెందిన సతీష్ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ లో ఈపీ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామకృష్ణాపూర్​కు చెందిన రాము శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే5 గనిలో జనరల్ మజ్దూర్ గా పనిచేస్తున్నారు. భార్య, కొడుకు ఉన్నారు.

కార్మిక సంఘాల నాయకుల ఆందోళన