Breaking News

చర్లలో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి

చర్లలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని చర్లలోనే ఏర్పాటుచేయడం ద్వారానే ఐదు రాష్ట్రాల ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్శా నర్సింహామూర్తి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం.నాగరాజు అభిప్రాయపడ్డారు. మైదాన ప్రాంతమైన ములుగులో ఏర్పాటుచేయడం సరికాదన్నారు. శనివారం వారు చర్లలో విలేకరులతో మాట్లాడారు. చర్లలో ఏర్పాటుచేస్తే ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీలకు అత్యంత అనువుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఆదివాసీలను ఉన్నతవిద్యకు దూరం చేసేలా గిరిజన సంక్షేమశాఖ, రాష్ట్ర, కేంద్ర మంత్రులు వ్యవహరించడం సరికాదన్నారు. వర్శిటీ ఏర్పాటుకు అన్ని ఆదివాసీ సంఘాల అభిప్రాయాలను స్వీకరించాలని సూచించారు.
వారికే ఓటు వేయాలి
ఏజెన్సీలో వందశాతం ఉద్యోగాలు, ప్రమోషన్లు ఆదివాసీలకు దక్కేలా జీఓనం.3కి మద్దతిచ్చే ఎమ్మెల్సీ అభ్యర్థికి మాత్రమే ఆదివాసీ పట్టభద్రులు ఓటు వేయాలని వారు పిలుపునిచ్చారు. జాతి భవిష్యత్​ విద్యావంతులపైనే ఆధారపడి ఉందన్నారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే విద్యావంతులు రాజకీయ పార్టీల ప్రలోభాలకు తలొగ్గకూడదని సూచించారు. ఆదివాసీల్లో సంపూర్ణ అక్షరాస్యత, ఆరోగ్యం సాధించాలంటే విజ్ఞులైన విద్యావంతులు ముందుకు రావాలని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్శా నర్సింహామూర్తి పిలుపునిచ్చారు.