న్యూఢిల్లీ: కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్మింటన్ టోర్నీలు మరింత ఆలస్యంగా మొదలుకానున్నాయి. ఈ సీజన్లో జరగాల్సిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘ (బీడబ్ల్యూఎఫ్) తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్‌ను రద్దుచేసింది. సందిగ్దంలో ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), కొరియా ఓపెన్ (నవంబర్ 24–29) టోర్నీలను కూడా రద్దు చేసింది.
ప్రస్తుతం కొన్ని దేశాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని బీడబ్ల్యూఎఫ్ కార్యదర్శి జనరల్ థామస్ లుండ్ తెలిపారు. మిగతా టోర్నీల భవితవ్యంపై అవసరమైనప్పుడు సమాచారం ఇస్తామన్నారు. మరోవైపు బ్యాడ్మింటన్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని భారత డబుల్స్ టాప్ షట్లర్ అశ్విని పొన్నప్ప, లక్ష్యసేన్‌తో పాటు దాదాపు 20 మంది షట్లర్లు బెంగళూరులోని ప్రకాశ్ పదుకోన్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ)లో ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. దాంతో, కరోనా కారణంగా దాదాపు రెండు నెలలుగా నిలిచిపోయిన ఆటను తిరిగి ప్రారంభించేందుకు తొలి అడుగుపడింది.