భోపాల్: మనుషులు రోజు రోజుకు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నారు. జాలి, దయలేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ యజమానులైతే ట్రీట్‌మెంట్ పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్న ఓ వృద్ధుడు హాస్పిటల్ లో బిల్లు కట్టలేదని అతడిని మంచానికి కట్టేశారు. ‘మా నాన్నను హాస్పిటల్‌లో చేర్చే సమయంలో రూ.5వేలు కట్టాం.
ఆ తర్వాత ట్రీట్‌మెంట్ చేసి రూ.11వేలు బిల్లు కట్టమని చెప్పారు. మా వద్ద డబ్బు లేదని చెప్పడంతో మా నాన్నను మంచానికి కట్టేశారు’ అని పేషంట్ కూతురు చెప్పింది. కాగా, హాస్పిటల్ వర్గాలు మాత్రం ఆమె ఆరోపణలను ఖండించారు. పేషంట్‌కు ఫిట్స్ ఉందని, కింద పడిపోతారని తాళ్లతో కట్టేశామని చెప్పారు. హాస్పిటల్ బిల్లును కూడా మాఫీ చేశామని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సీరియస్ అయ్యారు. హాస్పిటల్‌కు చెందిన వారిపై చర్యలు తీసుకుంటామని, దీనిపై విచారణకు ఆదేశించామని చెప్పారు.