సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతమైన చర్చ నడుస్తోంది. భవనాల కూల్చివేతలతో రూ.వేలకోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ విపక్షాలు నెత్తినోరూ మొత్తుకుంటున్నాయి. కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి మరో రూ.500 కోట్లు కావాలని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. దీనిపై మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారి మాటలేవీ సర్కారు చెవికెక్కడం లేదు సరికదా.. మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎదురుదాడి చేయడాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు.
మంత్రులు ఏమన్నారంటే..
మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస గౌడ్ తదితరులు పాత సచివాలయ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కి తగ్గేదే లేదంటూ స్పష్టం చేశారు. పాత సచివాలయం శిథిలమైందని, అందువల్ల ఆ శిథిలాల్లో తాము సంసారం చేయలేమంటూ తెగేసి చెప్పారు. మరోవైపు ప్రస్తుతం సచివాయలంలోని సీ, డీ బ్లాకులు, రాక్ స్టోన్ బిల్డింగ్ కూల్చివేత మొత్తం పూర్తయింది. ఈలోగా కొందరు సామాజిక కార్యకర్తలు కోర్టు మెట్లెక్కారు. జీహెచ్ఎంసీతో పాటు పర్యావరణ అనుమతుల్లేకుండానే సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని వారు న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేయడంతో సోమవారం వరకూ సచివాలయంలో కూల్చివేత పనులను ఆపాలంటూ హైకోర్టు సర్కారును ఆదేశించింది.
సీఎం కేసీఆర్ చెప్పారు
ఈ సంగతి ఇలా ఉంటే… ఇప్పుడు రాష్ట్రంలో ఒక్క సచివాలయమే శిథిలావస్థలో ఉందా..? మిగతా ప్రభుత్వ ఆఫీసులు గానీ, ఆస్పత్రులు గానీ, పాఠశాలల గానీ శిథిలావస్థకు చేరుకోలేదా..? అనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం మెదళ్లలో మెదలుతున్నాయి. అనేక దవాఖానాలు, ఎంతో చరిత్ర కలిగిన స్కూళ్ల భవనాలు పెచ్చులూడి పడతున్న ఘటనలను మనం అనేకం చూస్తున్నాం. కానీ వీటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలో కరోనా కరోళ నృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ముఖ్యంగా మన రాష్ట్రంలోని ప్రముఖ ఆస్పత్రుల గురించి చెప్పుకోవాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానాను సందర్శించారు. నిజాం నవాబు హయాంలో నిర్మించిన ఈ ఆస్పత్రి.. వారసత్వ భవనం కావడంతో దాన్ని కూల్చలేని పరిస్థితి నెలకొందని ఆయన అప్పట్లో అన్నారు. అందువల్ల అదే ప్రాంగణంలో రెండు పెద్ద పెద్ద టవర్లను నిర్మిస్తామనీ, ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇది జరిగి దాదాపు ఐదేండ్లు గడుస్తోంది. సీఎం హామీకి ఇంతవరరకూ అతీగతీ లేదు. మరోవైపు అదే ఉస్మానియాలో రాత్రి వేళల్లో కుక్కలు, పిల్లులు, పందులు స్వైర విహారం చేస్తున్న వీడియోలు సామాజిక మధ్యామాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
శిథిలావస్థలో ఆస్పత్రులు
ఉస్మానియా తర్వాత రాష్ట్రంలో అతి పెద్దది సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి. ఇప్పుడు పూర్తిగా కోవిడ్ చికిత్స కేంద్రంగా మారిన ఈ హాస్పిటల్‌లో మామూలు రోజుల్లోనే పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటుంది. ముక్కుపుటాలదిరిపోయే వాసనతో రోగులు నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇక పాతబస్తీలోని పేటబుర్జు దవాఖానా, కోఠిలోని ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్ చిన్నపిల్లల దవాఖానాల్లో అనేక భవనాలు శిథిలావస్థలకు చేరాయి. ఎంఎన్ జే కేన్సర్ఆస్పత్రి భవనం ఇందుకు మినహాయింపేమీ కాదు. సరైన మౌలిక వసతుల్లేక అవి కునారిల్లుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు కరోనాతో జనం విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో పడకలు లేక, ఉన్నా వాటిపై నమ్మకం లేక ప్రైవేట్ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. వారి బాధలను పట్టించుకోని ప్రభుత్వం ప్రస్తుతం కష్టకాలంలో కొత్త సచివాలయం నిర్మాణానికి పూనుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శిథిలావస్థకు చేరిన ఆస్పత్రులు, స్కూలు బిల్డింగ్లను కూల్చి.. వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని కొందరు సోషల్మీడియా వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్చేస్తున్నారు.
- July 12, 2020
- Top News
- GANDHI HOSPITAL
- OSMANIA
- SECRETARIAT
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- సెక్రటేరియట్
- Comments Off on సెక్రటేరియట్ ఓకే కానీ..