- ఆన్‌లైన్‌లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్-నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకావిష్కరణ
న్యూఢిల్లీ: విద్యావ్యవస్థలోని సాంకేతిక అంతరాలను తొలగించడం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను చేరుకోవడంతో పాటు అందరికీ సెకండరీ, ఉన్నతవిద్యను అందించవచ్చని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ఐసీటీ అకాడమీ రూపొందించిన ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్- నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ..‘ఎంతోమంది చిన్నారులకు సాంకేతిక ఉపకరణాల వినియోగం తెలియదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా.. అలాంటి వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. తద్వారా మారుతున్న సాంకేతికతను వారు వినియోగించుకునే దిశగా మనమంతా కృషిచేయాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.
‘లాక్ డౌన్ కారణంగా చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్ విద్యావిధానంలో భాగమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా ఆన్‌లైన్ విధానంలో చదువుకునేందుకు సరైన శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), వర్చువల్ రియాలిటీ, అగుమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే తరగతుల నిర్వహణ ఉంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వాలు.. అందరికీ అన్నిస్థాయిల్లో సరైన విద్యను అందించేందుకు ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. ‘భారతదేశంలోని యువశక్తి మన బలం. మనకున్న గొప్ప అవకాశం కూడా. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. యువతలో శక్తి సామర్థ్యాలకు కొదువలేదు. వీరికి సాంకేతికతను అందించి నైపుణ్యానికి సానబెట్టాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడాన్ని విద్యాసంస్థలు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.