సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దులపై గట్టినిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శనివారం జిల్లా పరిధిలోని ఈగలపెంట వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు కనోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేశామన్నారు.
జిల్లాకు తూర్పు శ్రీశైలం, ప్రకాశం, గుంటూరు, నల్గగొండ జిల్లాలు, పడమర మహబూబ్ నగర్, ఉత్తర దిశలో హైదరాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు, దక్షిణంలో కర్నూలు, గద్వాల జిల్లాల్లో పాజిటివ్ కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయని వెల్లడించారు. దీంతో జిల్లాకు ప్రమాదం ఉందని, వైరస్ వ్యాప్తి చెందకుండా అన్నిచోట్ల పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
వైద్యారోగ్య సిబ్బంది వినియోగించే థర్మల్ స్కానర్ పనితీరు, పోలీసు సిబ్బంది రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కోరారు. వారి వెంట అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా అటవీశాఖ అధికారి జోజి, అచ్చంపేట డీఎస్పీ నరసింహులు, సీఐ బిసన్న, ఎస్సైలు ఉన్నారు.