Breaking News

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టా బుక్కులు

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టా బుక్కులు

  • ఇక ముందు ఇంచు భూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్​లోనే..
  • సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం
  • ఫ్రీగా నోటరీ, జీవో 58, 59 స్థలాల రెగ్యులరైజేషన్​
  • ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు

సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ ఉంటుందన్నారు. కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు.. తదితర అంశాలపై ప్రగతి భవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇళ్లు, ప్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న ఇళ్లు, ఫామ్ హౌస్​ లు, వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్కపైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని కోరారు. ఇకముందు ఇంచు భూమి ఒకరి పేరు నుంచి మరొకరికి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని స్పష్టంచేశారు. వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సీఎం కోరారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్​లో తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
పేదల ఆస్తులకు రక్షణ
నిరుపేదల ఇళ్ల స్థలాలను పూర్తిస్థాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనివల్ల పేదల ఇంటిస్థలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ ఆస్తుల మ్యుటేషన్, ఎల్ఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇళ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరీ నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచ్​లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది సహకరించాలని సూచించారు. ఎంపీవోలు పర్యవేక్షించాలని సూచించారు.
భవిష్యత్​లో ఇబ్బందులు రాకుండా చూసుకోండి
‘గ్రామాలు, మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇళ్ల వివరాలు ఆన్ లైన్ లో నమోదు కావాలి, ఇంటికి నంబర్ కేటాయించాలి, ట్యక్స్ వసూలు చేయాలి, నాన్ అగ్రికల్చర్ కింద నాలా కన్వర్షన్ మార్చాలి. ఈ విషయంలో వంద శాతం ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసే విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు బాధ్యత తీసుకోవాలి. ధరణి పోర్టల్ కావడంలో కాస్త ఆలస్యమైనా పర్వాలేదు కానీ పోర్టల్ ప్రారంభమైన తర్వాతే వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ జరుగుతుందని’ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎండోమెంట్, వక్ఫ్, ఎఫ్ టీఎల్, నాలా, యూ ఎల్ సీ పరిధిలో నిర్మించుకున్న ఇళ్లకు ఈ మ్యుటేషన్ వర్తించదని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఆస్తుల నమోదు ప్రక్రియ, రెగ్యులరైజేషన్​, ఉచిత నాలా కన్వర్షన్ చేయడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి
వ్యవసాయేతర ఆస్తుల ఆన్ లైన్ నమోదు ప్రక్రియతో పాటు ప్రజలకు ప్రభుత్వం అందజేసే మెరూన్ కలర్ పాస్ పుస్తకాలు అందించే విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు, మండల, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం
గ్రామీణ ప్రాంతాల్లో భూముల పరస్పర కోనుగోళ్ల మార్పిడికి సంబంధించిన సాదాబైనామాలను ఉచితంగా మ్యుటేషన్ చేయించే ప్రక్రియకు చివరి సారిగా త్వరలోనే అవకాశం కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలిపారు. భవిష్యత్​లో ఇకముందు సాదాబైనామాలను అనుమతించే ప్రశ్నే లేదని స్పష్టంచేశారు.
నోటరీ, జీవో 58, 59 స్థలాల ఉచిత క్రమబద్ధీకరణ
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉన్న నోటరీ, జీవోనం.58, 59 పరిధిలోని పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్దీకరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో జీవో ద్వారా వెల్లడించనున్నట్లు వివరించారు.