విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకొనేందుకు విజయ్ ముందుకొచ్చి ఎంసీఎఫ్ (మిడిల్ క్లాస్ ఫండ్)ను ఏర్పాటు చేశాడు. దీంతో ముందుగా రూ.25లక్షలతో రెండువేల మందికి సాయం చేద్దామనుకున్నాడు. తన ఆలోచన సక్సెస్ కావడంతో ఎంసీఎఫ్ ద్వారా విజయ్ కొన్నివేల మధ్యతరగతి కుటుంబాలకు సాయాన్ని అందించాడు. తన ఫౌండేషన్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు విజయ్. ఎంత మందికి సాయం అందింది.. ఎంత మందికి అందాల్సి ఉంది.. అనేది లెక్కలతో సహా వెల్లడించాడు.
ఫైనల్ రిపోర్ట్ రిలీజ్ చేస్తూ.. ఇప్పటికి విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా 17,723 కుటుంబాలకు సాయం అందించినట్లు పేర్కొన్నాడు. అంటే 50,800 మంది మిడిల్ క్లాస్ వారికి సహాయం అందిందని ప్రకటించాడు. ఈ ఫౌండేషన్ కు ఇప్పటివరకు రూ.1.71 కోట్ల ఫండ్ వచ్చిందని.. 8,515 మంది ఈ ఫౌండేషన్ కు విరాళాలు అందించినట్లు తెలిపాడు. 535 మంది వలంటీర్లు ఫౌండేషన్ కోసం కష్టపడ్డారని చెప్పాడు. ఇంకా అప్లికేషన్స్ వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో ఎంసీఎఫ్ ను రెస్ట్ మూడ్ లో ఉంచుతున్నట్లు విజయ్ దేవరకొండ తెలియజేశాడు. మధ్యతరగతి వారిపై విజయ్ చూపించిన ఈ ప్రయత్నాన్ని ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.