Breaking News

వాళ్లిద్దర్ని ఆపడం కష్టం

వాళ్లిద్దర్ని ఆపడం కష్టం

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్​లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్​ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ ఇద్దరిలో తమకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ‘స్మిత్ ఎక్కువగా బ్యాక్ ఫుట్ ఆడతాడు. బంతిని కూడా చాలా ఆలస్యంగా ఎదుర్కొంటాడు. దీనివల్ల బంతిని ఏ వైపు టర్న్ చేయాలన్న దానిపై సందిగ్దం తలెత్తుంది. వన్డేల్లో ఏబీ మంచి ప్లేయర్. అతనికి ఓ భిన్నమైన శైలి ఉంది. బంతి ఎక్కడేసినా.. వెంటాడి మరి చితక్కొడతాడు. ఇప్పుడు అతను రిటైర్డ్ అయ్యాడు కాబట్టి బాధలేదు. ఈ ఇద్దరు మినహా నా బౌలింగ్​లో ఎక్కువ పరుగులు తీసిన బ్యాట్స్​మెన్​ ఎవరూ లేరు. వేరే వాళ్లకు బౌలింగ్ చేయడానికి కూడా నేను భయపడలేదు’ అని కుల్దీప్ వివరించాడు. టీమ్​లో నిలకడగా అవకాశాలు రాకపోవడం, కొన్ని నైపుణ్యాలను మర్చిపోవడం వల్లే గతేడాది విఫలమయ్యానన్నాడు. సహచరుడు యజ్వేంద్ర చహల్​తో తనకు ప్రత్యేకమైన బంధం ఉందన్నాడు. మైదానంలో, బయట చాలా విలువైన సలహాలు ఇస్తాడని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.