సారథి న్యూస్, నారాయణపేట: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను వాటి యజమానులు ఆదుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం, గొల్లపల్లిలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కూలీలను మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలతో పాటు వలసొచ్చిన కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు, నగదును ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మానవతా దృక్పథంతో వలస కూలీల సంక్షేమం కోసం నిత్యావసర వస్తువులు, నగదును పంపిణీ చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.
ఇటుక బట్టీల యజమానులు కూలీల సంక్షేమం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారి పిల్లల కోసం ట్యూషన్ మాస్టర్ ను నియమించి చదువు చెప్పించాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ, సామాజికదూరంతో కూలీలు పని చేసుకోవాలని సూచించారు.
నిబంధనలు పాటించకపోతే వారి బట్టీలను మూసివేయించాలని కలెక్టర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాష, కలెక్టర్ హరిచందన, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.