Breaking News

వన్యప్రాణులకు రక్షణ

వన్యప్రాణులకు రక్షణ

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ తో కలిసి వన్యప్రాణులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం దోమలపెంట గెస్ట్ హౌస్ లో అటవీ అధికారులతో సమీక్షించారు. ఇటీవల అమెరికాలోని బ్రాంగ్జ్‌ జూపార్క్ లో నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిన నేపథ్యంలో అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమలలో వన్య ప్రాణుల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

జంతువులు అనారోగ్యానికి గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన తాగునీటిని అందించాలన్నారు. జంతువులకు నీటిని అందించే సిబ్బందికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా పులుల, వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు జిల్లా అటవీ అధికారి జోజి వివరించారు.

సౌరశక్తి బోర్ల ద్వారా చిన్నచిన్న గుంతలు, చెక్‌ డ్యామ్‌లు, సాసర్ల పిట్లలో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. చెంచుపెంట చెంచులకు నిత్యావసర సరుకులను ప్రతినెలా క్రమం తప్పకుండా అందజేయాలని ఆర్డీవో పాండు నాయక్ ను ఆదేశించారు.