– మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సారథి న్యూస్, ఖమ్మం : ప్రభుత్వ సూచనల మేరకు గ్రామా వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఖమ్మం టీటీడీసీ భవన్ లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం 2020 సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్, ఎన్ఎస్పీ, ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ అధికారులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంటల విధానాన్ని అధికారులు అమలు జరపాలన్నారు.
గ్రామాల్లోని రైతుల వద్దకు వెళ్లాలని ప్రతిరోజూ ప్రతి విస్తరణాధికారి రైతులను కలువాలని, నూతన సాగు విధానంపై అవగాహన కల్పించి, వానాకాలంలో లాభసాటి, అధిక దిగుబడి, డిమాండ్ ఉన్న పంటలను పండించే విధంగా ప్రోత్సహించాలన్నారు. సప్లై డిమాండ్ మధ్య సమన్వయం చేయాలని, మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు వంటలు పండించే విధంగా వారికి సూచనలు చేయాలన్నారు. అదేవిధంగా కూరగాయలు సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
జిల్లాలో 3,18,000 మెట్రిక్ టన్నుల వరికి గాను రూ. 354 కోట్లు, 1,48,886 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలకు గాను రూ.80కోట్లు రైతులకు చెల్లించి ప్రభుత్వం ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. రికార్డ్ స్థాయిలో సేకరించామని, అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మార్క్ ఫెడ్ డీఎంలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్ వీ కర్ణన్, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, మార్కుఫెడ్ వైస్ చైర్మన్ రాజశేఖర్, వ్యవసాయ జిల్లా అధికారి ఝాన్సీ లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు.