– స్వీయ రక్షణే అందిరికీ సేఫ్
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ మెలిగితే చుట్టుపక్కల వారికి కూడా మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చాలా చోట్ల రెడ్ జోన్స్ ను ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో స్థానికంగానే ఉంటూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని అంటున్నారు. రెడ్ జోన్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా ఉండేలా చూసుకోవాలి.
అత్యావసర పరిస్థితుల్లో ఒకవేళ వచ్చినప్పటికీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లనుగాని, స్లీల్ రాడ్లను, బైక్స్, కార్లు, సైకిళ్లను ముట్టుకోవద్దు. ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉండడం కూడా చాలా మంచిదని అభిప్రాయపడుతున్నారు. కూరగాయల కోసం, మెడికల్ షాపుల వద్ద మందుల కోసం వెళ్లి వచ్చినట్లయితే ఇంటికి రాగానే వేడినీళ్లతో స్నానం చేసి వేడి నీళ్లు తాగినట్లయితే మరింత ఉత్తమమని సూచిస్తున్నారు. రోజూ ధరిస్తున్న మాస్క్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ఉతికిన తర్వాత కాసేపు ఎండలో ఉంచిన తర్వాతే వినియోగించాలి. మాంసం, కూరగాయలను ఉప్పు, వేడి నీళ్లలో కడగడం మంచిది. చేతులకు గ్లౌస్ లు ధరించి కూరగాయలు, ఇతర సరుకులు పట్టుకుంటే కొంతవరకు వైరస్ ను దరిచేరకుండా చూడొచ్చు. ఇప్పటినుంచి ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ డాక్టర్ల సలహాలు, సూచనలు అనుసరిస్తే కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించవచ్చని సూచిస్తున్నారు.