సారథి న్యూస్, మెదక్: యాసంగి సీజన్ లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికి అందుతున్న తరుణంలో అకాలవర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈదురుగాలులకు తోడు వడగళ్లు కురుస్తుండడంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు దెబ్బతింటున్నాయి.
వడ్లు రాలి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయం శివ్వంపేట , చిలప్ చెడ్, కొల్చారం, మెదక్, రామాయంపేట, నిజాంపేట్, చిన్న శంకరంపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. అగ్రికల్చర్ ఆఫీసర్లు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం 201 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. అత్యధికంగా శివ్వంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో 107 ఎకరాల్లో , చిలప్ చెడ్ మండలంలో 94 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నతి. అలాగే శివ్వంపేట మండలంలో దాదాపు 20 ఎకరాల్లో మామిడి తోటలు, దాదాపు 40 ఎకరాల్లో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే రామాయంపేట పట్టణం తోపాటు, గొల్పర్తి, అక్కన్న పేట, నిజాంపేట్ మండలం నందిగామ, చిన్న శంకరం పేట మండలాల్లో వివిధ గ్రామాల్లో పొలాల్లో కోసి పెట్టిన వరి మెదలు నాని పోగా ఆయాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.