Breaking News

రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

రూ.123 కోట్లతో 50 థీమ్ పార్కులు

సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్​బొంతు రామ్మోహన్​వెల్లడించారు. బుధ‌వారం ఉప్పల్​ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో క‌లిసి కాప్రా స‌ర్కిల్‌లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్​బీ నగర్​జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కుల‌లో యోగా, వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌లు ఉంటాయన్నారు. ఢిల్లీ, ఇండోర్, బెంగ‌ళూర్ వంటి ముఖ్యనగరాల్లోని పార్కులను పరిశీలించి ఇక్కడి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఏఎస్‌ రావున‌గ‌ర్‌లో రూ.2.3 కోట్ల వ్యయంతో, వాస‌వి ఎన్‌క్లేవ్ కుషాయిగూడ రూ.2.5 కోట్లు, ఈసీ న‌గ‌ర్(చర్లపల్లి డివిజ‌న్‌) రూ.2.5 కోట్లు, బీఎన్‌.రెడ్డి న‌గ‌ర్ పార్కు (చర్లపల్లి డివిజ‌న్‌) రూ.3 కోట్లు, మ‌ల్లాపూర్ పార్కు (మ‌ల్లాపూర్ డివిజ‌న్‌) రూ.3కోట్లు, బండబావి పార్కు నోమ టాకీస్ వ‌ద్ద రూ.3కోట్ల వ్యయంతో పార్కులను నిర్మిస్తున్నట్లు మేయర్​వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, బయోడైవర్సిటీ అదనపు కమిషనర్ కృష్ణ, స్థానిక కార్పొరేటర్లు పి.పావని మహిపాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, కె.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.