-మంత్రి హరీశ్‌రావు
సారథి న్యూస్, మెదక్: వృథానీటికి అడ్డుకట్ట వేయడం, భూగర్భ జలాల పెంపు, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూ.1200 కోట్ల నాబార్డ్ నిధులతో రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం చెక్ డ్యామ్ లు నిర్మిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బుధవారం ఆయన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి హవేలిఘనపూర్ మండలం సర్ధన వద్ద మంజీరా నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హవేలి ఘనపూర్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. మెదక్ పట్టణంలో డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెదక్ లో టీఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సాగునీటి కష్టాలను పూర్తిగా దూరం చేసేందుకు ప్రాజెక్టులు, చెక్ డ్యాంలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు వచ్చిన వెంటనే అక్కడి నుంచి హల్దీ ప్రాజెక్ట్ ద్వారా మెదక్ మండలంలోని బొల్లారం మత్తడికి చేరుతాయని చెప్పారు. దీంతో హవేలి ఘనపూర్ మండల పరిధిలోని కూచన్‌పల్లి, సర్ధన చెక్‌డ్యాంలకు నీరు వస్తాయన్నారు. తద్వారా సింగూర్, ఘనపూర్ ఆనకట్ట నిండకున్నా బొల్లారం మత్తడి ద్వారా మహబూబ్‌నహర్ కాల్వ కింద 13వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
మంజీరా నదిమీద సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో 15 చెక్ డ్యాంలు నిర్మించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. తద్వారా 25వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, భూగర్భజలాలు వృద్ధిచెంది బోర్ల ఆధారంగా పంటలు సాగుచేసే వేలాది మంది రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మెదక్ చైర్మన్ చంద్రపాల్, హవేలి ఘనపూర్ ఎంపీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.