Breaking News

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం

ఢిల్లీ: రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ ప్రకటించారు. రేపు రాజస్థాన్​లో జరగబోయే కాంగ్రెస్​ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్​లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్​కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా ఇందులో నుంచి 30 మంది సచిన్​ పైలట్​ వెంట ఉన్నట్టు సమాచారం. రాజస్థాన్​లో కాంగ్రెస్​పార్టీని కూల్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లాట్​ ఆరోపించిన విషయం తెలిసిందే. బీజేపీ సచిన్​పైలట్​ వెనుక ఉండి ఈ డ్రామా నడిపిస్తున్నదని పలువురు కాంగ్రెస్​ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా రేపు జరుగబోయే కాంగ్రెస్​ శాసనసభాపక్ష సమావేశానికి ఎంతమంది హాజరవుతారో అనే దాన్ని బట్టి రాజస్థాన్​ రాజకీయాలు తేలనున్నాయి. మరోవైపు రాజస్థాన్​ పరిణామాలపై కాంగ్రెస్​ పార్టీ అధినాయకత్వం ఆలస్యంగా మేల్కొన్నది. ఆదివారం సాయంత్రం కొంతమంది కాంగ్రెస్​ పెద్దలు రాజస్థాన్​కు వెళ్లినప్పటికీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సచిన్​ పైలట్​కు భారీప్యాకేజీ ఆశచూపి తనవైపుకు తిప్పుకున్నట్టు సమాచారం. రాజస్థాన్​లో సచిన్​పైలట్​ను సమన్వయం చేసుకుంటూ పాలనసాగించడంలో సీఎం అశోక్​ గెహ్లాట్​ విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని బీజేపీ చక్కగా వినియోగించుకున్నది.