- వెల్లడించిన డైరెక్టర్ జనరల్ టెడ్రోస్
న్యూయార్క్: కరోనా ట్రీట్‌మెంట్‌కు కొన్ని దేశాలు వాడుతున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపేసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలకు ముప్పు ఉందని ద ల్యాన్సెట్ రిపోర్ట్ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. చాలా దేశాలు ఈ ట్యాబ్లెట్స్‌ను ఉపయోగించడం మానేశాయని ఆయన పేర్కొన్నారు. వీటిని వాడడంపై డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు సమీక్షిస్తుందని, అందుకే దాన్ని వాడడం లేదని వివరణ ఇచ్చారు.
హైడ్రాక్సీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, కేవలం మలేరియా పేషంట్లకు మాత్రమే అవి ఉపయోగపడతాయని ద ల్యాన్సెట్ చెప్పింది. దాదాపు 96వేల మంది పేషెంట్లు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదని చెప్పింది. కరోనా ట్రీట్‌మెంట్ కోసం కొన్ని దేశాలు చాలారోజులుగా యాంటీ మలేరియా డ్రగ్‌ను ఉపయోగిస్తున్నాయి. నిజానికి అది కరోనా ట్రీట్‌మెంట్ కోసం తయారు చేసింది కాదు. కానీ కరోనా లక్షణాలు ఉన్నవారు కూడా వీటిని వాడుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ మాత్రలు వేసుకుంటున్నట్లు చెప్పారు.