- ప్రజలు ఇప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలని సూచన
- మిడతల దాడితో నష్టపోయిన వారిని ఆదుకుంటాం
న్యూఢిల్లీ: కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రపంచం మొత్తానికి యోగా, ఆయుర్వేద సామర్థ్యం తెలిసొచ్చిందని మోడీ చెప్పారు. ‘కరోనా వైరస్ సంక్షోభంలో ప్రపంచంలోని చాలా మంది లీడర్లతో మాట్లాడాను. వాళ్లంతా ఆయుర్వేదం, యోగాపై ఇంట్రెస్ట్ చూపించారు. ఈ టైంలో యోగా, ఆయుర్వేదం ఎలా ఉపయోగపడిందో తెలుసుకున్నారు. ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. హాలీవుడ్ నుంచి హరిద్వార్ వరకు ప్రతి ఒక్కరు యోగాను నేర్చుకున్నారు’ అని మోడీ చెప్పారు. ప్రపంచంలోని ప్రతిచోట ప్రజలు యోగా గురించి తెలుసుకుంటున్నారని, ఆన్‌లైన్ క్లాసులు కూడా ఎక్కువయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనా శ్వాస వ్యవస్థను దెబ్బతిస్తోందని, యోగా ద్వారా దీన్ని అధిగమించవచ్చని చెప్పారు. అన్ని జాగ్రత్తలతో ప్యాసింజర్ ఫ్లైట్లను తిరిగి ప్రారంభించామని, త్వరలోనే ఇండస్ట్రీయల్ యాక్టివిటీస్ కూడా రీబూట్ చేస్తామని అన్నారు. దేశంలో చాలా వరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ పిలపుపునిచ్చారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ ద్వారా తాజా పరిస్థితులపై మోడీ మాట్లాడారు. కరోనా సంక్షోభం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని మోడీ చెప్పారు. కరోనాపై పోరాటం ఆపకూడదని, సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మాస్క్ లు కచ్చితంగా పెట్టుకుని జాగ్రత్త వహించాలని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా వ్యాప్తి తగ్గిందని అన్నారు. దేశవ్యాప్తంగా మిడతల దాడితో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మోడీ చెప్పారు. వ్యవసాయ రంగంలో ఏర్పడిన ఈ సంక్షోభాన్ని కొత్త ఆవిష్కరణల ద్వారా ఎదుర్కోగలమనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. కరోనాపై వైద్య సిబ్బంది, మీడియా ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేశారని అన్నారు. కరోనా సమయంలో చాలా మంది కొత్త ఆవిష్కరణలను చేశారని, విద్యారంగంలో ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయని చెప్పారు. వలస కూలీల కష్టాన్ని తలుచుకుని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం శ్రామిక్ రైళ్లు నడుపుతున్నామని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ కార్యక్రమం ద్వారా దేశం ఉన్నత స్థితికి చేరుతుందని చెప్పారు.