Breaking News

మృగశిర సందడి షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మృగశిర ముందు రోజే ఆదివారం చేపలను చాలామంది కొనుగోలు చేశారు. మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం.. సోమవారం మృగశిర కార్తె రానుంది. దీని వెనక రకరకాల కారణాలు ఉన్నాయి. మొదటి రోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గం పేర్లతో పిలుస్తారు. ఈ కార్తె ప్రారంభమైందంటే ఎండాకాలం మండే ఎండలు పోయి వర్షాకాలం షురూ అయినట్లు లెక్క. వరుణుడి పలకరింపుతో పొంగిపొర్లే నీటికి చెరువుల్లో ఎగిసిపడే చేపలను తిని వ్యవసాయ పనులకు సన్నద్ధమవడం మృగశిర కార్తె ప్రత్యేక.. అయితే కాలంతో మనిషికి విడదీయరాని అనుబంధం ఉంది. కార్తె కార్తెకు వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలే ఎండల వేడి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మృగశిర రోజున చేపలను తింటుంటారు. ఈ నేపథ్యంలో వాటికి మంచి గిరాకీ ఉంటుంది.

చేపలను బట్టి డిమాండ్
కొర్రమీను, బొమ్మ, రౌవులు, బొచ్చెలు, మిర్గాలు, బంగారు తీగలు, జెల్లలు ఇలా రకరకాల చేపలు మార్కెట్ లో దొరుకుతున్నాయి. మెదక్​ జిల్లాలో సాధారణ రోజుల్లో తెల్లరకం చేపలకు కిలో రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. నల్లరకం చేపలు రూ.400 నుంచి రూ.500 వరకు లభ్యమవుతున్నాయి. కానీ మిర్గం రోజున మార్కెట్లో తెల్లచేపలు రూ.150 నుంచి రూ.200, నల్లరకం చేపలు రూ.500 నుంచి రూ.600 వరకు రేటు పలుకుతున్నాయి. ధర ఎంత పలికినా మృగశిర రోజున చేపలను కొనేందుకు మాంసం ప్రియులు వెనుకాడడం లేదు.