సారథి న్యూస్, ఎల్బీనగర్: మూసినది ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఉదయం నాగోల్ బ్రిడ్జి ప్రక్కన పరీవాహక ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. మూసినది చుట్టూ నీళ్లు నిరంతరం ప్రవహించే విధంగా ఛానెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువు చుట్టుపక్కల పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించాలని, చెరువు నందు మొలిచిన గుఱ్ఱపు డెక్కను కూడా వెంటనే తొలగించాలన్నారు. మూసినది వెంట దోమల నివారణకు డ్రోన్స్ ఏర్పాటు చేసి, వాటితో ఫాగింగ్ చేయాలని ఆదేశించారు.
నాలాను 50 ఫీట్ల వెడల్పు చేసి నిరంతరం నీళ్లు ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాపు ఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు డ్రోన్ సహాయంతో దోమలను నిర్మూలించే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ మాలతి, ఎస్.ఈ.రామచంద్ర రెడ్డి, కొత్తపేట కార్పొరేటర్ సాగర్ రెడ్డి, నాగోల్ డివిజన్ నాయకులు చెరుకు ప్రశాంత్ గౌడ్, అధికారులు నూరుల్లా అహ్మద్, కల్పన, శ్రీనివాస్, విష్ణురావు ఉన్నారు.