- ‘నిసర్గ’తో ముంబైలో హై ఎలర్ట్
- బుధవారం తీరాన్ని తాకే అవకాశం
- అలర్ట్ అయిన గుజరాత్
ముంబై: ‘నిసర్గ’ తుఫాను తీవ్ర రూపం దాల్చుటుండటంతో మహారాష్ట్ర తీరం, ముంబైలో వాతావరణ శాఖ హై ఎలర్ట్ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ వాయుగుండం గంటలకు 11 కి.మీ.ల వేగంతో కదులుతోందని అధికారులు చెప్పారు. ముంబై, థానే, ముంబై సబ్‌అర్బన్, పాల్ఘారా, రాయ్‌గడ్, రత్నగిరి, సిందూడర్గ్ తదితర ప్రాంతాల్లో బుధవారం తీరాన్ని తాకొచ్చని అన్నారు. తద్వారా గంటకు 150 నుంచి 115 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీచేశారు. గాలి ధాటికి పెద్ద చెట్లు, కరెంటు పోల్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
48 గంటల పాటు చేపలవేటపై నిషేధం విధించారు. ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర, గుజరాత్ తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్(ఎన్డీఆర్‌ఎఫ్) బృందాలను మోహరించారు. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌థాక్రేతో మాట్లాడారు. ప్రజలు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే కరోనా కేసులతో ఇబ్బందులు పడుతున్న మహారాష్ట్రలో దాదాపు వందేళ్ల తర్వాత ఇంత పెద్ద సైక్లోన్‌ను ఫేస్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 1882 తర్వాత ‘నిసర్గ’ వచ్చిందన్నారు.