Breaking News

మీ త్యాగాలు వృథా కావు

మీ త్యాగాలు వృథా కావు

  • టీఆర్​ఎస్​ కార్యకర్తలను ఆదుకుంటాం
  • ఎమ్మెల్యేలూ.. వారికి అండంగా ఉండండి
  • సమావేశంలో మంత్రి కె.తారక రామారావు
  • ప్రమాద బీమా కోసం రూ.16.11 కోట్లు డిపాజిట్​

సారథి న్యూస్, హైదరాబాద్: పార్టీ కార్యకర్తల శ్రమ, పట్టుదల, త్యాగాలు వృథాకాదని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ ​వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కె.తారక రామారావు అన్నారు. వారి సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న పార్టీ ప్రతి కార్యకర్తకు రూ. రెండు లక్షల ప్రమాద బీమా అందేలా రూ.16,11,19,119 చెక్కును తెలంగాణ భవన్​లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు..

కర్త, కర్మ, క్రియ కేసీఆరే
‘తెలంగాణకు కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరే. వందేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోంది. 20 ఏళ్లలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. జలదృశ్యం నుంచి గెంటి వేయబడిన పార్టీ మనది. తెలంగాణ సాధించే వరకు ఎన్నో అటుపోట్లతో ఈ స్థాయికి చేరుకున్నాం. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి.. అని ధైర్యం నింపిన నేత సీఎం కేసీఆర్​. 13 ఏళ్లు ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నాం. స్వీయ రాష్ట్ర అస్తిత్వమే మనకు రక్ష అని జయశంకర్ సర్ ఎన్నో సార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం. కాంగ్రెస్, బీజేపీ నేతలకు పదవులు దక్కడం టీఆర్ఎస్ పుణ్యమే..’ అని అన్నారు.

కార్యకర్తలను ఆదుకోవాలి
‘టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయశక్తి. ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలి. వారి ఇళ్లకు వెళ్లి సమస్యలను తెలుసుకోండి. ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానంగా కార్యకర్తలు ఉండాలి. కరోనాలో ప్రజలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. త్వరలోనే జిల్లా కార్యాలయాలను ప్రారంభిస్తాం. కరోనా కారణంగా కార్యకర్తల శిక్షణ వాయిదా వేసుకున్నాం. కరోనా సంక్షోభం ముగిసే వరకు ప్రజలకు సేవలు అందించాలి.’ అని మంత్రి కేటీఆర్ ​దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కెప్టెన్​ లక్ష్మీకాంతారావు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, బీమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.