– ఎమ్మెల్యే సమక్షంలో రత్నాపూర్ వాసుల నిరసన
సారథి న్యూస్, నర్సాపూర్: ‘ఏడాదిన్నర కాలంగా గ్రామసభ నిర్వహించలేదు. ఎన్నికలు లేకుండా సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధి చెందుతుందని ఆశపడ్డాం. కానీ సమస్యలు పట్టించుకోకుండా సర్పంచ్, ఎంపీటీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
నియంత్రిత సాగుపై అడిషనల్ కలెక్టర్ నగేష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆర్డీవో అరుణరెడ్డి సమక్షంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. కొందరు రైతులు, యువకులు లేచి గ్రామంలో అభివృద్ధి జరగలేదని, సర్పంచ్ గ్రామసభనే నిర్వహించడం లేదని మండిపడ్డారు. గ్రామ సమస్యలను గాలికొదిలేసి సర్పంచ్ నర్సాపూర్, ఎంపీటీసీ హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా పాల్గొన్నారు.