- మాజీ స్టార్ క్రికెటర్ మహ్మద్ కైఫ్
న్యూఢిల్లీ: ఒకప్పుడు టీమిండియాలో బెస్ట్ ఫీల్డర్లు యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్. అథ్లెటిక్ విన్యాసాలతో దాదాపు 20 నుంచి 30 పరుగులు ఆపేవారు. నమ్మశక్యం కానీ క్యాచ్ లను అద్భుతహా అనే రీతిలో అందుకునేవారు. ఓ దశలో ప్రపంచ బెస్ట్ ఫీల్డర్ల సరసన చోటు కూడా సంపాదించారు. అయితే ఇప్పుడున్న టీమిండియాలో తమలాంటి ఫీల్డర్లు కరువయ్యారని కైఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయి ఫీల్డర్లు కనిపించడం లేదన్నాడు. ‘మన జట్టులో మంచి ఫీల్డర్లు ఉన్నారు. కానీ కంప్లీట్ ప్యాకేజ్ ఫీల్డర్లు మాత్రం లేరు. అంటే మంచి క్యాచర్, రెగ్యులర్ గా వికెట్లను షూట్ చేయాలి. మైదానంలో అన్నివైపులా చురుగ్గా కదలాలి. వేగంగా పరుగెత్తాలి. కదులుతున్న బంతిని ఒడిసి పట్టే సరైన టెక్నిక్ తెలిసి ఉండాలి. ఈ సామర్థ్యాలన్నీ ఉన్న వారే పూర్తిస్థాయి ఫీల్డర్ అవుతాడు. మేం ఆడే రోజుల్లో నేను, యువీ పూర్తిస్థాయి ఫీల్డర్లని పేరు తెచ్చుకున్నాం’ అని కైఫ్ వివరించాడు. స్లిప్, లాంగాన్, షార్ట్ లెగ్.. ఇలా మైదానంలో బంతి గాల్లోకి లేస్తే క్యాచ్ అందుకునే సత్తా ఉన్న ఫీల్డర్లు ఇప్పుడు లేరన్నాడు. జడేజా ఒక్కడే అప్పుడప్పుడు మెరుస్తున్నాడని కితాబిచ్చాడు. అతను కూడా మరింత రాటుదేలాలన్నాడు.