Breaking News

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

మహిళా సంఘాలకు ఆదర్శ వ(అ)నిత

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా..

సెమినార్​ను ప్రారంభిస్తున్న
అనిత(ఫైల్​ఫొటో)

సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది.

‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే సమష్టి భావనతో సంఘంలో సభ్యులైన తోటి మహిళలకు స్త్రీనిధి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదిగేలా చేసింది. గ్రామసంఘం లీడర్‌‌ స్థాయి నుంచి అంచెలంచెలుగా స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్‌‌ రాష్ట్ర మేనేజింగ్‌‌ కమిటీ అధ్యక్షురాలి ఎదిగింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల స్వయం సహాయక సంఘాల్లో(ఎస్ హెచ్ జీ) సభ్యులైన 54 లక్షల మంది పేద మహిళలకు అహర్నిశలు సేవలందిస్తోంది. అతివల జీవన వికాసానికి సారథిగా చేయూతలో చెలిమై నిలిచే వారధిగా మహిళా లోకానికి పెన్నిధిగా నిలుస్తోంది.
సంఘం నిర్వహణలో క్రియాశీలకం
మెదక్‌‌ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌‌ గ్రామానికి చెందిన సందిరి అనిత 2003లోస్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరారు. ఆమె డిగ్రీ వరకు చదవడంతో సంఘం రికార్డుల నిర్వహణ, బ్యాంకు పనులపై అవగాహన ఉంటుందని చెప్పి సంఘ సభ్యులంతా కలిసి గ్రూప్‌‌ లీడర్‌‌గా ఎన్నుకున్నారు. స్త్రీనిధి మార్గదర్శకాలకు అనుగుణంగా సంఘం నిర్వహణలో క్రియాశీలకంగా పనిచేయడంతో అనతి కాలంలోనే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలిగా ఏక్రగీవంగా ఎన్నికై, ఎల్లాపూర్‌‌ గ్రామంలోని 36 స్వయం సహాయక సంఘాలను సమన్వయం చేసే బాధ్యతలు చేపట్టారు. మైక్రో ఫైనాన్సర్ల ఆగడాలను అరికట్టి పేద మహిళల ఆర్థికావసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు అనిత ఎల్లాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సంఘం సభ్యులకు అన్ని తానై సమగ్రంగా అవగాహన కల్పించి రూ.60 లక్షల వరకు రుణాలు, 57 మందికి డెయిరీ లోన్లు ఇప్పించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చేశారు.
సమన్వయమే గురుతర బాధ్యత
ఎల్లాపూర్‌‌లో స్త్రీనిధి పథకాన్ని పక్కాగా అమలు చేయించడం ద్వారా అనిత పాపన్నపేట మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మండలంలోని 36 గ్రామైఖ్య సంఘాలు (వీఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేసేలా ప్రత్యేక చొరవ చూపి ఆయా సంఘాలకు రూ.నాలుగు కోట్ల మేర రుణ సహాయం మంజూరు చేయించారు. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్‌‌ జిల్లా సమాఖ్య డైరెక్టర్‌‌గా ఎన్నికైన అనిత 45 మండలాల్లో 9వేల పైచిలుకు సంఘాలను సమన్వయం చేసే గురుతర బాధ్యతను స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలోని 9 జిల్లాలకు చెందిన 13 మంది డైరెక్టర్లు కలిసి స్త్రీనిధి మేనేజింగ్‌‌ కమిటీ అధ్యక్షురాలిగా అనితను ఎన్నుకున్నారు. నాలుగేళ్లుగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే స్త్రీనిధి మేనేజింగ్‌‌ కమిటీ సమావేశాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. ఏటా నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా సంఘాలకు లోన్లు మంజూరయ్యేలా కృషి చేస్తున్నారు.
రికవరీలో ఆదర్శం
బ్యాంకు లోన్లు ఇవ్వడం ఒక ఎత్తయితే వాటిని రికవరీ చేయడం మరో ఎత్తు. ఏ బ్యాంకు అయినా రికవరీ శాతం బాగుంటేనే మళ్లీ కొత్త లోన్లు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. స్త్రీనిధి మేనేజింగ్‌‌ కమిటీ అధ్యక్షురాలైన అనిత ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద మొత్తంలో లోన్లు మంజూరు చేయించడంతో పాటు వారు తీసుకున్న రుణాలను సక్రమంగా సద్వినియోగం చేసుకునేలా, సకాలంలో చెల్లించేలా చొరవ తీసుకుంటున్నారు. తద్వారా 99 శాతం రుణ రికవరీ సాధించడం గమనార్హం.
కొత్త స్కీమ్​ లతో చేయూత
మహిళలకు మెరుగైన ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో సరికొత్త పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని అనిత తెలిపారు. స్త్రీనిధి ద్వారా రుణం తీసుకుని స్వయం ఉపాధి కోసం వివిధ వ్యాపారాలు నిర్వహించుకుంటున్న మహిళలకు వ్యాపారాభివృద్ధికి రూ. లక్ష నుంచి రూ.మూడులక్షల వరకు రుణ సహాయం అందించేందుకు ‘సౌభాగ్య’ పథకం, అలాగే కేవలం 48 గంటల వ్యవధిలో రుణ సహాయం అందించేందుకు ‘సువిధ’ పేరుతో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
నా భర్త ప్రోత్సాహంతోనే..
గ్రామస్థాయి మహిళా సంఘంలో సాధారణ సభ్యురాలిగా ఉన్న నేను స్త్రీనిధి మేనేజింగ్‌‌ కమిటీ అధ్యక్షురాలిగా రాష్ట్రస్థాయికి ఎదగడంలో నా భర్త రాజిరెడ్డి ప్రోత్సాహం చాలా ఉంది. ప్రైవేట్‌‌ ఉద్యోగి అయిన ఆయన నాకు తోడునీడగా నిలిచేవారు. ఒక్కోసారి రెండు, మూడు రోజులు హైదరాబాద్‌‌లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. స్త్రీనిధి మేనేజింగ్‌‌ కమిటీ అధ్యక్షురాలిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు, మహిళా సమాజంలో మంచి పేరు వచ్చింది. పేద మహిళలకు నా వంతు సేవ చేసేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటా..

– అనిత, స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్‌‌ రాష్ట్ర మేనేజింగ్‌‌ కమిటీ అధ్యక్షురాలు