Breaking News

మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌

మన సోనా షుగర్‌ ఫ్రీ రైస్‌
  • ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి, అధికారులు చెప్పాలె
  • మన పంట హాట్​ కేకుల్లా అమ్ముడుపోవాలె: సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్‌: ఏ పంటను ఎలా..ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వమే చెబుతుందని సీఎం కేసీఆర్​ స్పష్టంచేశారు. వరిలో ఏయే రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలని రైతులను కోరారు. వర్షాకాలంలో మక్క పంట వేయొద్దు.. బదులుగా కందులు వేయాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా వేయకపోతే వారికి రైతుబంధు రాదని స్పష్టంచేశారు. నియంత్రిత పద్ధతితో వ్యవసాయం చేయాలన్నారు. ‘తెలంగాణ సోనాకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. తెలంగాణ సోనాకు షుగర్‌ ఫ్రీ రైస్‌ అని పేరుంది. యాసంగిలో మక్కలు పండించాలి. సన్నరకాల్లో తెలంగాణ సోనా మంచిది. 40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దాం. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలి. నిజామాబాద్‌, జగిత్యాలలో పసుపు పంట వేసుకోవచ్చు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో సోయాబిన్‌ వేసుకోవచ్చు. వరి పంటలో తెలంగాణ సోనా రకం పండించాలి.10లక్షల ఎకరాల్లో పండించాలని’ సీఎం అన్నారు. ‘ప్రభుత్వం చెప్పే పంటలు రైతులతో వేయించే బాధ్యత కలెక్టర్లదే. త్వరలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ప్రస్తుతం 25 లక్షల టన్నుల గోదాంలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో న్యూస్‌ చానెల్‌ ద్వారా రైతులతో ముఖాముఖిగా మాట్లాడుతా. తెలంగాణ పంటలన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యే రోజు రావాలని’ అని ఆకాంక్షించారు. రైతుల లాభం కోసం అభ్యుదయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
రైతులు సంఘటితం కావాలి
‘రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంట సాగు చేస్తారని, అలా చేస్తే పంటకు మంచి ధర రాదని’ మరోమారు స్పష్టం చేశారు. మార్కెట్ డిమాండ్​ను బట్టి పంట పండించాలన్నారు. మనం గత ఏడాది 79 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రాజెక్టు లన్నీ పూర్తయితే.. కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. పూర్తిగా వరి పంట వేస్తే.. నాలుగున్నర కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని చెప్పారు. అంత పెద్దమొత్తంలో వరి వస్తే.. తట్టుకునే శక్తి.. బియ్యం తయారు చేయగల సామర్థ్యం మన దగ్గర ఉన్న రైస్ మిల్లర్లకు లేదన్నారు. మన మిల్లర్లు 1.75 కోటి టన్నుల ధాన్యం మాత్రమే మిల్లింగ్ చేస్తారని చెప్పారు. కావునా పంటలు వేసే ముందు లాభసాటి అనే అంశాన్ని తీసుకోవాలన్నారు. ఈ ఏడాది కరోనా వల్ల వరి ధాన్యాన్ని కొన్నామని, కానీ పంటలు కొనడం ప్రభుత్వ విధానం కాదని చెప్పారు. ఇప్పుడు రైతులంతా విడిపోయి ఉన్నారు. కానీ సంఘటి తం అయితే దేనినైనా సాధించగలమని రైతులకు సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. రాబోయే 15 రోజుల్లో ప్రతి జిల్లా అధికారులు వ్యవసాయ సంబంధిత పనులు మాత్రమే చేస్తారని చెప్పారు.