- బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
న్యూఢిల్లీ: టెస్టుల్లో టీమిండియాను నడిపిస్తున్న పేస్ బలగానికి మరో రెండేళ్లు తిరుగులేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. స్వదేశంతో పాటు విదేశంలోనూ వీళ్లకు ఎదురులేదన్నాడు. ‘గత రెండు సీజన్లలో ఇషాంత్(297 వికెట్లు), షమీ(180 వికెట్లు), ఉమేశ్ యాదవ్(144 వికెట్లు), బుమ్రా (68 వికెట్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. రాబోయే రెండేళ్లు కూడా వీళ్లకు ఎదురులేదు. ఏ ఇబ్బంది లేకుండా సమష్టిగా రాణించడం వీళ్లకు ఉన్న బలం. ఫిట్నెస్ను కాపాడుకుంటే అదనంగా మరికొన్ని రోజులు ముందుకు సాగుతారు.
కాకపోతే మా వ్యూహం భవిష్యత్ సూపర్ పేసర్లను తయారు చేసుకోవడం. సెలెక్టర్లు, కోచ్‌లు కలిసి పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తూ రిజర్వ్ బెంచ్ బలం పెంచుకోవాలి. ప్లేయర్ల వ్యక్తిగత వర్క్ లోడ్ ఆధారంగా రొటేషన్ పాలసీని కూడా పాటించాలి. దీనివల్ల ప్రధాన పేసర్లపై ఒత్తిడి తగ్గుతుంది. పెద్ద మ్యాచ్‌లో టాప్ బౌలర్లు మరింత విజయవంతంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది’ అని అరుణ్ పేర్కొన్నాడు. ఆస్ర్టేలియాతో నాలుగు టెస్ట్‌లు, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల వరకు వీళ్ల పేస్ పదును కొనసాగుతుందన్నాడు. తర్వాతి దశల్లో వీళ్లలో ఎవరు రిటైరైనా.. బుమ్రా దూకుడు మాత్రం కచ్చితంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.