ఇది అన్నమయ్య కీర్తనలోని..
పదం దీన్ని మనం మాట్లాడే మన భాషకు వర్తింపజేస్తూ ముచ్చటిద్దాం. తేట తెలుగు.. మాట అటుంచితే వాటమైన తెలుగు కోసమే ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రతిమాటకు అంటే ఏమిటి అని ఇంట్లోని కొత్త తరం పిల్లలు ప్రశ్నిస్తుంటే
గుండెలో కెళుక్కుమంటోంది. భాషకు పట్టం కట్టాల్సిన తెలుగు లోగిళ్లు అది జీర్ణావస్థకు చేరుతున్నా ప్రమాదం మనకు కాదు అనుకుంటున్నారు. మన జాతి మనుగడకే ముప్పు వస్తుందని గుర్తించడం లేదు. అదో వృథా ప్రయాసలా భావిస్తున్నారు. ఇతరత్రా భాషలతో కాలం గడిచిపోతుంది కదా అనే భావనలో పడుతున్నారు.
అదే సమయంలో మన సోదర భాషా మిత్రులు తమ, తమ భాషల పటిష్ఠతకు కంకణం కట్టుకొని శ్రమిస్తున్నారు. ఈ స్ఫూర్తి తెలుగు లోగిళ్లలో కొరవడడం ఆందోళనకరం. ఆలోచించాల్సిన తరుణం.
ఏది ప్రామాణికం..
వ్యవహరికంలో ఉండే పదాలన్నీ ప్రామాణికాలా కావా.. మాండలికాల్లో ఉండే వ్యత్యాసం పట్టుకుని అది తేడా అని, లేదా అదే భాష అనే భిన్న వాదనలు ఇప్పటివే కావు. మన వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులుగారు తన చివరి ఉపన్యాసంలో దీనికి సమాధానం చెప్పారు. ఇందుకు శ్రీనాథుడి హర విలాసంలో ప్రయోగించిన పప్పును, ఆముక్తమాల్యద లోని బేడలు ఉటంకిస్తూ ఒకటి కోస్తా వాడుక అయితే మరొకటి రాయలసీమ పదం రెండూ సమానార్థకాలే.. ఎవరి సౌలభ్యం కోసం వారు అక్కడి పదాలను వాడారు. ఇదే అంశం మరో ప్రాంతం వారు మరో ప్రయోగంలా చెప్పవచ్చు. వీటన్నిటికీ పదకోశాల్లో అర్ధాలు దొరుకుతాయి. అందుకే వ్యవహరికంలో వుండే అన్ని పదాలు అది గ్రామ్యాలు కావచ్చు.. దేశ్యాలు కావచ్చు, గ్రంధస్థం అయినవి కావచ్చు అన్నీ మన వ్యక్తీకరణ కు వీలు పడే పదాలే. అందుకే ఇటీవల విడుదలైన ఫిదా, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు అన్ని ప్రాంతాల వారి ఆదరణ పొందాయి. వీటిలో ప్రయోగించిన భాష అందరికి అర్ధమైంది.. ఇక ఫిదాలోని నాయకి సాయిపల్లవి తెలుగు అమ్మాయే కాదు. అంటే వాడుక భాష వ్యక్తీకరణ అవతల వారికి అర్థమైతే చాలు. అంటే గాని ఇదే ప్రామాణికం అనే స్థిరత్వం లేదు. ఇది సామాజిక ప్రవాహం.. దీనికి గణిత శాస్త్ర సిద్ధాంతాన్ని ఆపాదించలేం. అన్నమయ్య వాడిన పదాలు నాటి కాలంవే అయినా ఇప్పటికీ పాడుకోవడం లేదా ఇదీ అంతే. మొత్తానికి కావాల్సింది సరళమైన తెలుగు అది ప్రకృతి పదమైన , వికృతి పదమైనా ఒక్కటే హోదాలో ఉంటుంది.
ఒత్తులు.. అక్షరాలు.. ఓ ఆలోచన
తెలుగు కోసం మనం మరో వాదన వింటుంటాం.. అది ముందుగా ఒత్తులు నేర్పండి లేదా కొన్ని అక్షరాలు తొలగించారు ఇదేమి తీరు నా భాష కుంచించుకు పోతోంది.. అంటూ ఆవేదనలు వస్తుంటాయి. నిజమే ఒకప్పుడు ఇవన్నీ భాషలో ఇమిడి ఉండ వచ్చు. ఇప్పుడు సరళతరం చేయడానికి, సాంకేతికతను అందిపుచ్చుకోడానికి కొన్ని అక్షరాలు తొలగించి వాడుతూ ఉన్నాం ఋషికి బదులు రుషి వాడుతున్నాం అంత మాత్రాన అర్ధం అవుతోందా? లేదా? దురర్ధం వస్తోందా అన్నదే అంశం తప్పా వేరే ఏమి లేదు. తప్పుడు అర్థం, భాష్యం కానప్పుడు అన్నీ ప్రామాణికాలే. అన్ని వింయోగించ దగ్గవే. భాషే తగ్గుతోంది అంటే ఈ వివాదాలు తలకెత్తుకొని కొత్త తరాన్ని భయపెట్టడమే అవుతుంది.
అన్య భాషా పదాలు తగ్గించాల్సిందే..
తెలుగు నిత్య ప్రవాహం.. ఏ భాషా పదాన్నైనా చక్కగా ఇముడ్చు కోవడం దీని విశిష్టత. అలా అని భాషను అన్యభాషా పదాలతో నింపి ఇదే తెలుగు అనడం భావ్యం కాదు. ఇప్పుడు కొన్ని పత్రికలు ఆంగ్లపదాలతో అలవోకగా వాక్యాలను నింపి గందరగోళం చేస్తున్నాయి. కొన్ని అతి చాదస్తం చేసుకుని కృతక పదాలతో ఇబ్బంది పెడుతున్నాయి. దీనిపై విస్తృత చర్చ జరగాలి. తెలుగును బతికించాలి. కొత్త పదాలు వాడుకలోకి తేవడం ఓ యజ్ఞంలా సాగాలి. అంతెందుకు ఇంగ్లిషు వారికి పందికొక్కులు తెలియవు. తెలిసాక బండి కూట్ అనే పదాన్ని చేర్చుకున్నారు. అలాగే ఒరియా వారు బ్యాటరీకి బేతారోకో అనే పదం ప్రయోగించారు. మనం తెలుగులో ఉకారం చేర్చి ఆంగ్ల పదాలను తెలుగులో వినిగియోగిస్తూ ఉన్నాం. బస్సు, రైలు, మోటారు సైకిలు ఇలాంటివే. వీటికోసం కృతకానికి వెళ్లే కంటే ఇదే సౌలభ్యంగా భావిస్తున్నాం. అందుకే భావం బాగుండి.. భాషా సౌభాగ్యం పెంపొందిస్తే చాలు. కొత్త తరం భాషను అందిపుచ్చు కుంటుంది. ఇది ప్రస్తుత తెలుగు కుటుంబాలు, మాధ్యమాలు, భాషా సంఘాలు, ఆలోచించాలి.. మన తెలుగు వెలగాలి.. భాష పరిఢవిల్లాలి.
– పట్నాయకుని వెంకటేశ్వర రావు, 9705347880
పట్నాయకుని వెంకటేశ్వరరావు సార్ ఆర్టికల్స్ తో.. సారథి కి మరింత శోభ
Thank you Anand Sharma garu