ఒక వ్యక్తి నిర్మాణానికి తొలి పాఠశాలగా తాను పుట్టిపెరిగిన గృహమే ఆధారంగా నిలుస్తుందని సామాజిక శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఈ స్థితిలో చిన్నారులను మనం తీర్చిదిద్ద గలిగినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణం, మనోవికాసం ఎదిగాక సమాజంలో సాగించే మనుగడకు ఆలంబనగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇందుకు తొలి పాఠశాల అయిన ఇంటిని.. బిడ్డలను తీర్చిదిద్దే మహా ఆలయంగా ఎలా మలచాలన్నదే నేడు మన ముందున్న ప్రశ్న. దీన్ని చక్కదిద్దుకోకుండా మనమేమీ సాధించలేం. మనకో సామెత ఉంది ‘మొక్కై వంగనిదే మానై వంగుతుందా’ అని. అందుకే మన ఇంటినే చిన్నారుల భవితవ్యానికి, వారి ఎదుగుదలకు తొలివేదికగా మారిస్తే వారు కచ్చితంగా ఉత్తమ పౌరులవుతారు. సంస్కృతి, సంప్రదాయం, భాషను ఒక్కటేమిటి మన మనుగడను నిలుపుతారు. మరో తరానికి దిగ్విజయంగా తీసుకెళ్తారు.
వ్యక్తి వికాసం.. వేమన పద్యం
ఇదేంటీ నాలుగు లైన్ల పద్యం..(పాదాలు) వ్యక్తిని నడిపించేస్తుందా.. దానికి మించి అదిగో ఎన్నో వ్యక్తిత్వ తరగతులు ఉన్నాయి కదా అని నేటి తరం తల్లిదండ్రులకు సందేహాలు కలగవచ్చు. వేలకు వేలు ఖర్చు పెట్టి వ్యక్తిత్వ పాఠాలు నేర్పించి మురిసిపోవడం. మనది కాని కృతక వాతావరణాన్ని అద్దుకుని మెరిసిపోవడం. ఈ స్థితికి చక్కనైన సమాధానం చెప్తాడు మన వేమన ఈ పద్యం ద్వారా..
నిక్కమైన నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల
చాటుపద్యమిలను చాలదా యొకటి
విశ్వదాభిరామ వినుర వేమ అంటాడు.. ఇందులో ఉన్నవి అలతి అలతి పదాలే. అర్థం తెలిసిన వాక్యాలే. అంతేకాదు చక్కని పోలికలతో తలకెక్కే విధంగా వేమన చెప్పాడు. నవరత్నాల్లో ఉండే నీలం ..దాని స్వభావం.. మెరిసే రంగురాళ్లు..అలవోకగా చెప్పే చాటుపద్యం గొప్పతనం మూడు పాదాల్లో చెప్పి విశ్వదాభిరామ మకుటంతో పూర్తి చేసి ప్రశ్న సమాజానికే సంధించాడు. అంటే ఆలోచించ మన్నాడు. అంతర్మథనం చెందమన్నాడు. ప్రశ్నించాడు. తద్వారా వాస్తవాన్ని వివరించి ఏది అవసరమో నొక్కి చెప్పాడు. ఇలాంటి వేమన పద్యాలకు మించి వ్యక్తిత్వ పాఠాలు ఏవి ఉంటాయి. ఇదీ ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అంశం. మన పిల్లలకు ఓ వంద వేమన పద్యాలను సునాయాసంగా నేర్పించండి వారి వ్యక్తిత్వాన్ని వారే నిర్మించుకుంటారు. కొత్త కోణంలో సమాజాన్ని చూడడం ప్రారంభిస్తారు. అవధులు లేని జ్ఞానాన్ని వారే సముపార్జించుకుంటారు.
విశ్వకవి..మన వేమన
ఈ తరం వారికి వేమన ఎవరు అనే ప్రశ్న వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’..‘రెయిన్ రెయిన్ గో ఎవే..’ అంటూ గెంతులేసే సంస్కృతిని అద్దుకుంటున్న మనం వేమనను విస్మరిస్తున్నాం. వాస్తవానికి తెలుగు జాతి, కుటుంబాలకు వేమన వరప్రసాదం వంటివాడు. సుమారు 400 ఏళ్ల క్రితం అంటే 17వ శతాబ్దం.. 1672 కాలంలో కడప జిల్లాలో జన్మించాడు. వేమన కొండవీటిరెడ్డి భూస్వాముల కుటుంబీకుడని చరిత్రకారుల అంచనా. ఆయన సమాధి అనంతపురం జిల్లా కఠారుపల్లెలో ఉంది. అయితే దీనిపైన భిన్నవాదనలు ఉన్నాయి. ఆయన తొలుత ఉన్నత జీవితంలో గడిపినా చివరకు వైరాగ్యభావాన్ని వరించి ఓ భిన్నమైన ఆహార్యంతో చివరి దశ గడిపాడన్నది అందరికీ తెల్సిందే. ఆయన ఆటవెలది ఛందస్సులో మనకు అందించిన ఆణిముత్యాల లాంటి పద్యాలు నిజంగా తెలుగు లోగిళ్లలో పదిలపరచుకోవాల్సిన వ్యక్తిత్వ పాఠాలు. పిల్లలు, పెద్దలు నిత్యం భవద్గీత పారాయణంలా మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని కంఠస్థం చేయించాల్సిన అవసరం ఉంది.
రూపశిల్పి సర్ సీపీ బ్రౌన్
ఆంగ్లేయుల పాలనాకాలంలో తెలుగు ప్రాంతాలకు సర్ సీపీ బ్రౌన్ దొర వంటి మహనీయుడు కలెక్టర్గా పరిచయం కాకపోతే వేమన వంటి విప్లవకవి ప్రపంచానికి తెలిసేవాడు కాదు. బ్రౌన్ వేమన పద్యాల గొప్పతనాన్ని కడప కలెక్టర్గా ఉన్నప్పుడు తెలుసుకుని వాటిని పరిశోధించి పరిష్కరించి వందల పద్యాలను కాపాడాడు. వాటికి ఆంగ్లంలో తర్జుమా చేసి రాయడంతో వేమన విశ్వకవిగా వెల్లడయ్యాడు. వేమన పద్యాలకోసం తాళపత్ర గ్రంథాలను శోధించి సాధించాడు బ్రౌన్. వాటిని శుద్ధప్రతులుగా రాయించి అచ్చు వేయించాడు. ఇలా ఆ గొప్ప భాండాగారం మనకు పదిలంగా దక్కింది. వాటిని బ్రౌనే పునరుక్తులు, అతిశయోక్తులు, కూడికలు లేకుండా వాస్తవ పద్యాలను గుర్తించి విభాగాలుగా విడదీశాడు. ఇలా వేమన.. వ్యక్తిత్వం, నైతికత, బోధన, వేదాంతం, ప్రకృతి శక్తి, వైరాగ్యం వంటి అంశాల ఆధారంగా రాసిన పద్యాలను ఆ విభాగాల్లో చేర్చి బ్రౌన్ వాటికి ఒక రూపం కల్పించాడు. అందుకే అవి సజీవంగా ఇప్పటికీ మన తెలుగువారికి దొరుకుతున్నాయి. వీటిని మనం తెలుగు వేదనాదంలా నిత్యపారాయణ పాఠంలా పిల్లలకు నేర్పించడమే కర్తవ్యం. వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది వేసి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడం తెలుగు కుటుంబాల బాధ్యత. విశ్వకవి వేమనకు తెలుగింట పెద్దపీట వేసి ఆయన సామాజిక దృక్కోణాన్ని అందరికీ తెలిసేలా చేయడమే మనం ఆ విప్లవమూర్తికి ఇచ్చే అతి పెద్ద గౌరవం.
– పట్నాయకుని వెంకటేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు
సెల్ నం.97053 47880