ముంబై: కరోనా కేసులతో సతమతమవుతూ.. నిసర్గ తుపానుతో అతలాకుతలమైన ముంబై ప్రజలకు ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. శనివారం రాత్రి నుంచి చాలా చోట్ల దుర్వాసన వస్తుండటంతో జనమంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని చింబూర్, ఘట్‌కోపర్, కంజూర్‌మార్గ్, విక్రోలీ, పొవై, అంధేరీ, మన్‌కుర్ద్ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వాసన వస్తోందని ప్రజలు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వాసన ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై దృష్టి పెట్టారు. మొత్తం 17 ఫైర్ ఇంజిన్లను రెడీగా ఉంచారు. వాసన ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై దర్యాప్తు స్టార్ట్ చేశారు. అయితే ఎలాంటి గ్యాస్ లీకేజ్ లేదని ముంబై ఫైర్ బ్రిగేడ్ అధికారులు ఆదివారం ఉదయం ప్రకటించారు. కానీ అంధేరీ ఏరియాలో మాత్రం స్మెల్ వస్తోందని ముంబై చీఫ్ ఫైర్ ఆఫీసర్ పీఎస్. రహంగ్డలే అన్నారు. ‘గ్యాస్ లీకేజ్ ఎక్కడ లేదు. కానీ పొవై, అంధేరి ఇంకా స్మెల్ వస్తోంది. ఆ స్మెల్ ఏమిటి అనేది తెలుసుకునేందుకు 17 ఫైర్ ఇంజిన్స్ రంగంలో ఉన్నాయి. ఎవరూ భయపడవద్దు. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎంజీఎల్, ఆర్‌సీఎఫ్, పోలీసులకు సమాచారం అందించాం’ అని అన్నారు.
ఈ విషయంపై మంత్రి ఆదిత్య థాక్రే స్పందించారు. ‘ముంబైలోని చాలా ప్రాంతాల్లో గ్యాస్ వాసన వస్తుందని కంప్లయింట్స్ వచ్చాయి. దానికి సంబంధించి ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఎవరూ భయపడవద్దు. కిటికీలు, తలుపులు మూసివేసి ఇంట్లోనే ఉండండి. బీఎంసీ పరిస్థితిని మానిటర్ చేస్తోంది’ అని ఆదిత్యథాక్రే ట్వీట్ చేశారు. ‘ పరిస్థితి అదుపులో ఉంది. అన్ని చర్యలు తీసుకున్నాం. వాసన ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎవరూ భయపడ వద్దు. మిగతా వారిని భయపెట్టొద్దు. స్మెల్ వల్ల ఇబ్బంది కలిగితే ముఖంపై తడి వస్త్రం వేసుకోండి’ అని బీఎంసీ ట్వీట్ చేసింది. శనివారం సాయంత్రం నుంచి దుర్వాసన వస్తోందని ప్రజలు ట్వీట్లు చేస్తూ కంప్లయింట్ చేశారు.