బ్రహ్మముహూర్తం(బ్రాహ్మీ ముహూర్తం) చాలా విలువైన కాలం.. మన పూర్వీకులు కాలాన్ని ఘడియల్లో లెక్కించేవారు. ఒక ఘడియకు ప్రస్తుత మన కాలమానం ప్రకారం 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా రెండు ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అన్నమాట. పగలు, రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అని పిలుస్తుంటారు. ఒక అహోరాత్రంకు సంబంధించి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయన్నట మాట. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది బ్రహ్మ ముహూర్తం. అంటే రోజు మొత్తంలో 29వది అన్నమాట.. దీనికి అధిదేవత బ్రహ్మ కావడంతో బ్రహ్మ ముహూర్తం అనే పేరొచ్చింది.
వాస్తవానికి తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని.. ఆ తర్వాత కాలాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తంలో నిద్రలేచి భగవంతుడిని ధ్యానించి పనులు ప్రారంభించాలని పెద్దలు చెబుతుంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యం దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్నే ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుడి శక్తి తోడవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఏం చేయాలి?
తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులు ధ్యానం, జపతపాదులు చేసేవారికి చాలా విలువైంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛగా, నిర్మలంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం ఇది. ఈ వేళ మన మనసు ఎలా కావాలంటే అలా తేలికగా మారుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, రుషులు హిమాలయాల్లో ధాన్యం చేస్తూ వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపజేస్తారు. తద్వారా ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృథా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దలు.
ఇది విలువైన సమయం
ఈ సమయంలో చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృథా చేయకూడదు. పూజలు, యోగా, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12సార్లు ఓంకారం, ఐదు నిముషాలు ఏదైన కీర్తన పాడడం ద్వారా మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని ద్వారా సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే రుషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాల్లోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి బాగా పనిచేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
:: దిండిగల్ ఆనంద్‌శర్మ
96660 06418