నాటి రజాకార్ల రాచరిక పాలనకు వీరోచితంగా పోరాడిన వీర బైరాన్ పల్లి నెత్తుటి చరిత్రకు 72 ఏళ్లు నిండాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన హైదారాబాద్ సంస్థానానికి నిజాం నవాబు కబంధహస్తాల్లోనే ఉండిపోయింది. రజాకార్లపై ప్రజలు, కమ్యూనిస్టులు చేస్తున్న తిరుగుబాటును అణిచివేయడానికి ఖాసీంరజ్వీ మిలిటెంట్లను పంపించాడు. 1948 ఆగస్టు 27న నాటి ఓరుగల్లు(వరంగల్), జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం బైరాన్‌పల్లి గ్రామం రజాకార్ల నరమేధంలో 118 మంది వీరమరణం పొందారు. నిజాం రజాకార్లు గ్రామాలపై దాడులు చేస్తూ ఊళ్లకు ఊళ్లే తగలబెట్టడమే కాకుండా వారి ఆరాచకాలు, ఆకృత్యాలకు ఎంతోమంది స్త్రీలు తమ మానప్రాణాలు కోల్పోయారు.
గ్రామరక్షణ దళం ఏర్పాటు
బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్యలాంటి యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. దొరలపై ధిక్కారస్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచేలా చేశారు. తమ పొరుగు గ్రామమైన లింగాపూర్పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళ్తున్న క్రమంలో బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని విధ్వంసం చేయాలనే నిర్ణయానికొచ్చారు. 1948 మే నెలలో బైరాన్పల్లిపై దాడికి విఫలయత్నం చేశారు. మరోసారి 60మంది రజాకార్లు తుపాకులతో దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి 150 మంది రజాకార్లు పోరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు. ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకార్లు బైరాన్పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు.
ఎత్తయిన బురుజు నిర్మాణం
బైరాన్పల్లిపై రజాకార్లు ఏ క్షణానైనా దాడికి పాల్పడే అవకాశముందనే అనుమానంతో గ్రామం నడిబొడ్డున ఎత్తయిన బురుజు నిర్మించారు. బురుజుపైన మందుగుండు సామగ్రిని నిల్వచేసుకున్నారు. అనుమానితులు కనిపిస్తే బురుజుపై కాపాలా ఉండే ఇద్దరు వ్యక్తులు నగారా(బెజ్జాయి) మోగించడంతో ఆ శబ్దానికి సమీప గ్రామాలైన వల్లంపట్ల, కూటిగల్, బెక్కటీ, కొండాపూర్, లింగాపూర్, దూళ్మిట్ట గ్రామాల ప్రజలు పరిగెత్తుకుని వచ్చేవారు.
ఆ రోజు ఏం జరిగింది..
1948 ఆగస్టు 26న రాత్రి రజాకార్లు, పోలీసులు..నిజాం సైన్యం జనగామలో రాత్రి 12 గంటలకు పది బస్సుల్లో బయలుదేరారు. లద్దునూరు మీదుగా బైరాన్‌పల్లి చేరుకున్నారు. గ్రామం చుట్టూ డేరాలు వేశారు. ఉదయం నాలుగు గంటలకు బహిర్భూమికి వెళ్లిన వడ్ల నర్సయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వెంటబెట్టుకుని గ్రామంలోకి వస్తుండగా, వారిని నెట్టివేసి నర్సయ్య ఊళ్లోకి పరుగులు పెట్టాడు. రజాకార్లు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు. నగారా మోగించాడు. దీంతో ఊళ్లో ఉన్న జనమంతా గ్రామ బురుజుపైకి వెళ్లి తలదాచుకున్నారు. వారికి రక్షణగా గ్రామరక్షక దళాలు నిలిచాయి. బురుజుపై నుంచి రజాకార్లపైకి కాల్పులు జరిపాయి. వేకువజామున గ్రామంలో తుపాకీ మోతలు వినిపించాయి. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఆగస్టు 27న నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు 1200 మంది బలగంతో భారీమందు గుండు సామగ్రి, తుపాకులతో దొంగచాటున గ్రామపొలిమేర్లకు చేరుకున్నారు. గ్రామ పొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకార్ల కదలికలను గ్రామ రక్షక దళాలకు అందించే విశ్వనాథ్ భట్జోషిని రజాకార్లు పట్టుకుని బంధించారు. తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లెంగల వెంకటనర్సయ్యను రజాకార్లు పట్టుకోగా వారి నుంచి తప్పించుకుని గ్రామాన్ని చేరుకుని రజాకార్లు గ్రామంలో చొరబడ్డారని కేకలు వేశాడు. గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బరుజుపైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు నగారా మోగించాడు. బురుజుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య, మోటం పోచయ్య, బలిజ భూమయ్య నిద్రమత్తు వదిలించుకునేలోగా రజాకార్ల తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పు రవ్వలతో బురుజుపై నిల్వచేసిన మందుగుండు సామగ్రి పూర్తిగా కాలిపోయింది. దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకార్లు దొరికినోళ్లను దొరికినట్లుగా మట్టుబెట్టారు. అంతటితో ఆగకుండా రజాకార్లు ఇంటింటికీ తిరిగి 92 మందిని పట్టుకొని పెడరెక్కలు విరిచి జోడుగా లెంకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు. గ్రామం వెలుపల శవాల చుట్టూ మహిళలను వివస్త్రలుగా చేసి బతుకమ్మలు ఆడించారు. ఈ దాడుల్లో 118 మంది అమాయకులు బలికాగా, 25 మంది రజాకార్లు చనిపోయినట్లు చరిత్ర చెబుతోంది. బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకార్లు దాడులు చేసి 30మందిని పొట్టనబెట్టుకున్నారు. బైరాన్‌పల్లి పోరాటస్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది. భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనికచర్యకు దిగేందుకు సిద్ధం కాగా, నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారు.
బైరాన్‌పల్లి మారణహోమంపై ప్రజాకవి కాళోజీ స్పందన
కాటేసి తీరాలె
మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన
మనపిల్లల చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచిపోకుండగ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండగ బుసకొట్టుచుండాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె
సత్త్యమ్మహింసని సంకోచపడరాదు
దయయు ధర్మంబని తడుముకోపనిలేదు
శాంతియని చాటినను శాంతింపగారాదు
క్షమయని వేడినను క్షమియింపగారాదు
చాణిక్యనీతిని ఆచరణలో పెట్టాలె
కాలంబురాగానె కాటేసి తీరాలె
తిట్టిననాల్కెల చేపట్టికోయాలె
కొంగులాగినవేళ్ల కొలిమిలోపెట్టాలె
కళ్లుగీటిన కళ్ల కారాలు చల్లాలె
తన్నిన కాళ్లను ‘డాకలి’గ వాడాలె
కండకండగకోసి కాకులకువేయాలె
కాలంబురాగానే కాటేసి తీరాలె
బైరాన్‌పల్లి పోరాటానికి గుర్తింపేది..?
రజాకార్లకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన అమరులు, సమరయోధులను నాటి సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేశారు. జలియన్‌వాలా బాగ్ దురాగాతాన్ని మించిన బైరాన్‌పల్లి పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందేలా పోరాట ఘట్టాన్ని పాఠ్యంశాల్లో చేర్చి, గ్రామంలో స్మృతివనాన్ని ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాటి వీరోచిత పోరాటంలో గ్రామంలోని ప్రతికుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంది. నాటి సమరయోధులకు ఎలాంటి పింఛన్ అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన తొలి, మలిదశ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన బైరాన్‌పల్లి పోరాటాన్ని ప్రభుత్వం గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బైరాన్‌పల్లిని పర్యాటక క్షేత్రంగా చేస్తామన్న హామీలు కాగితాలపైనే మిగిలిపోయాయని గ్రామస్తులు, అభ్యుదయవాదులు, ప్రజాసంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.1.1 కోట్ల వ్యయంతో, బురుజు చుట్టూ ప్రహరీతో పాటు ఒక వాచ్‌టవర్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని, అమరవీరుల స్థూపం నుంచి బురుజు వరకు స్మృతివనం ఏర్పాటు.. ఒక కలగా మిగిలిపోయింది. అమరవీరుల విగ్రహాల ఏర్పాటును విస్మరించడం శోచనీయం.. ఇప్పటికైనా బైరాన్‌పల్లి పోరాటానికి గుర్తింపు వస్తుందని ఆశిద్దాం..
::: సతీశ్