వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్ 46వ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డు సృష్టించారు. ఎలక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను మేజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ కు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించి పరాజయం పొందారు. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్.. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు జో బైడెన్ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మగౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సెనేటర్ నుంచి ప్రెసిడెంట్ దాకా..
జో బైడెన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన అసలు పేరు జో రాబినెట్ బైడెన్ జూనియర్. యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు. 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు 29 ఏళ్లు. దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు. 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్ మొదటి భార్య, 13 నెలల కూతురు నవోమీ చనిపోయారు. బైడెన్ 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. ఒక కుమారుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించాడు.
- November 8, 2020
- Archive
- AMERICA PRESIDENT
- JOEBIDEN
- KAMALAHARRIS
- SENATOR
- ZILJOCOB
- అమెరికా
- కమలాహరీస్
- జిల్ జాకబ్స్
- జోబైడెన్
- డోనాల్డ్‌ట్రంప్
- పెన్సిల్వేనియా
- సెనేటర్
- Comments Off on బైడెన్‌కు జైకొట్టిన అమెరికన్లు