- నిన్న నాలుగు.. నేడు ఐదు
- పాడుబడ్డ బావిలో మృతదేహాలు
- వరంగల్ రూరల్ జిల్లాలో ఘటన
సారథి న్యూస్, వరంగల్: వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో పాడుబడ్డ బావిలో గోనె సంచిలో ఉన్న 9 మృతదేహాలు బయటపడ్డాయి. తాజాగా శుక్రవారం ఐదు డెడ్ బాడీస్ బయటపడగా, గురువారం నాలుగు డెడ్ బాడీస్ వెలుగుచూశాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎండీ మక్సూద్ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్ నగరానికి కుటుంబంతో సహా వలస వచ్చాడు. తొలుత కరీమాబాద్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. గత డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వరంగల్ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో.. నెలన్నర రోజులుగా గోదాంలోనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు అతని భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరి కుటుంబంతో పాటు బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో నివాసం ఉంటూ గోదాంలో పనిచేస్తున్నారు. పరిశ్రమ యజమాని సంతోష్ రోజూలాగే గురువారం మధ్యాహ్నం గోదాంకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూడగా నాలుగు మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. వారిని ఎండీ మక్సూద్(50), అతని భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), మూడేళ్ల మనవడిగా గుర్తించారు. శుక్రవారం బయటపడిన మృతదేహాల్లో మక్సూద్ కుమారుడు షాబాద్(22), బిహార్‌కు చెందిన కార్మికుడు శ్రీరామ్(23)గా గుర్తించారు. మరో డెడ్ బాడీ వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు గీసుకొండ పోలీసులకు సమాచారమిచ్చారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందం సభ్యులు, పోలీసులు కలిసి డెడ్ బాడీస్ ను తాళ్లతో వెలికితీశారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు.
హత్యా..ఆత్మహత్యా?
ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బావిలో ఉండడంతో హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు వరంగల్ సీపీ రవీందర్, మేయర్ ప్రకాశ్ రావు, కలెక్టర్ హరిత పరిశీలించారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.