– మంత్రి ధర్మాన కృష్ణదాస్
సారథి న్యూస్, శ్రీకాకుళం: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతిచెందిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో మృతిచెందిన ఆంధ్రా మెడికల్ కాలేజీ స్టూడెంట్ విద్యార్థి చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం చెక్కును శనివారం అందజేశారు. చంద్రమౌళి స్వగ్రామం సంతకవిటి మండలం కావలి గ్రామానికి వెళ్లి చంద్రమౌళి తల్లిదండ్రులు ఈశ్వరరావు, పద్మావతిని పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్యాస్ లీక్ ఘటనలో 12మంది మృతిచెందగా వారికి నష్టపరిహారంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారని అన్నారు. ఘటన జరిగిన ఐదురోజుల వ్యవధిలోనే 8 మంది బాధితుల కుటుంబాలకు విశాఖలోనే అందజేసినట్లు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు.
ఈ సంఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసిందన్నారు. వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఐదుగురు మంత్రులతో కూడిన బృందం సాధారణ పరిస్థితులు నెలకునేవరకు వారం రోజుల పాటు అక్కడే ఉండి స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తుచేశారు. మంత్రి వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, కలెక్టర్ జె.నివాస్, జి.స్వామినాయుడు, సిరిపురపు జగన్ ఉన్నారు.