Breaking News

బదిలీల ప్రభావం చూపేనా?

బదిలీల ప్రభావం చూపేనా?
    • సూర్యాపేటలో ముగ్గురు అధికారుల బదిలీ

    • లాక్‌డౌన్‌ అమలు చేయకపోవడంతోనే డీఎస్పీ, సీఐపై వేటు

    • డీఎంహెచ్‌వో సొంత పోస్టుకు బదలాయింపు
సారథి న్యూస్, నల్లగొండ: సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు అధికారుల బదిలీ అంశం చర్చనీయాంశమైంది. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం.. కరోనా వైరస్‌ విజృంభణను అరికట్టడంలో విఫలమయ్యారనే కారణంతో ఇద్దరు పోలీస్‌ అధికారులు, ఒక వైద్యాధికారిపై బదిలీ వేటువేసింది. గనెలలో సూర్యాపేట శివారు కుడకుడకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌ వెళ్లొచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతని నుంచి జిల్లాకు మొత్తం పాకింది.

పట్టణంలోని మార్కెట్‌ బజార్‌ నుంచి వైరస్‌ విజృంభించి 83 మందికి సోకింది. అయితే అనుమానితులను ఎప్పటికప్పుడు గుర్తించడంలో వైద్యారోగ్యశాఖ విఫలం కావడంతోనే ఎక్కువ కేసులు నమోదుయ్యాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ముందస్తుగా గుర్తించి ఉంటే కొంత కేసులు తగ్గేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అనుమానితుల్లో చాలామందికి లక్షణాలు కనిపించకపోవడంతో కేసులు ఆలస్యంగా బయటపడ్డాయి. వీరిని గుర్తించడంలో డీఎంహెచ్‌వో నిరంజన్‌ విఫలమయ్యారని ఆయనపై బదిలీ వేటుపడింది. ఆయనను సొంత స్థానమైన కోదాడ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పంపారు. ఆయన స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్‌వో సాంబశివరావును నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకు యాదాద్రి భువనగిరి జిల్లా గ్రీన్‌ జోన్‌లో ఉంది. ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. అక్కడ వైద్యారోగ్యశాఖ పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఇది సాధ్యమైందని భావించి ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. బుధవారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు.

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయలేదని..

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయలేదని ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. డీఎస్పీ నాగేశ్వరావును బదిలీ చేశారు. ఆయన స్థానంలో మోహన్‌కుమార్‌ను నియమించారు. ఆయన గురువారం విధుల్లో చేరారు. బుధవారం సీఐ శివశంకర్‌ను బదిలీ చేశారు. కొత్త ఇన్‌స్పెక్టర్‌గాయ రాచకొండ కమిషనరేట్‌ నుంచి ఆంజనేయులును నియమించారు. lSమార్చి 22వ తేదీన జనతా కర్ఫూ విధించారు. మరుసటి రోజు 23నుంచి కేంద్రం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొదటి పాజిటివ్‌ కేసు నమోదైనప్పటినుంచి రెడ్‌జోన్లుగా గుర్తించడం.. వాటినుంచి రాకపోకలను నియంత్రించడంలో ఇద్దరు విఫలమయ్యారన్న కారణంతోనే డీఎస్పీ, సీఐలపై వేటుపడినట్లు తెలుస్తోంది.

కట్టడికి పక్కా వ్యూహం

జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి అధికారులు పక్కా వ్యూహాన్ని రూపొందించారు. 12 కంటైన్‌మెంట్ల పరిధిలో ఇప్పటివరకు ఉన్న కర్ర బారికేడ్లను తొలగించి ఇనుప పైపులతో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు జిల్లా ప్రత్యేకాధికారిగా సర్పరాజ్‌ అహ్మద్‌ను నియమించారు. ప్రత్యేకంగా సూర్యాపేట మున్సిపాలిటీ కోసం ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)గా వేణుగోపాల్‌రెడ్డిని నియమించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర సూర్యాపేటకు వచ్చారు.

కరోనా వైరస్‌ విజృంభణకు కారణమైన మార్కెట్‌ బజార్‌ను సందర్శించి కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ మేరకు కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో బారికేడ్ల ఎత్తు పెంచడం, ఇంటినుంచి ఏ ఒక్కరినీ బయటికి వెళ్లనీయకుండా చూడడం, అనుమానితులను గుర్తించి వెంటవెంటనే క్వారంటైన్‌కు తరలించడం వంటి చర్యలకు ఉపక్రమించారు.